Cyber Crime: ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి: పోలీసుల అలర్ట్

Cyber Crime Alert Hyderabad Police on Investment Frauds
  • అత్యధిక లాభాల పేరుతో టోకరా వేస్తున్న సైబర్ నేరగాళ్లు
  • నకిలీ లాభాలు చూపిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు వెల్లడి
  • పెట్టుబడి అడ్వైజర్‌గా సందేశాలు వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచన
టెలిగ్రామ్, వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ సూచనల లింకులు వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ పేరుతో భారీ ఎత్తున మోసాలు జరుగుతున్నాయని... క్రిప్టో కరెన్సీ, ఫారెక్స్, స్టాక్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు లేదా గ్యారెంటీ లాభాల పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారని తెలిపారు. బాధితులను ఆకర్షించి, వెబ్‌సైట్లు, ట్రేడింగ్ డాష్‌బోర్డులు, యాప్స్ ద్వారా నకిలీ లాభాలు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రలోభపెడుతున్నారని పోలీసులు వివరించారు.

ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ ఆధారిత పెట్టుబడి మోసానికి గురై మాజీ పోలీసు అధికారి ఒకరు రూ.8.10 కోట్లు పోగొట్టుకున్నారు. పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అమర్ సింగ్ చాహల్ వాట్సాప్ ఆధారిత పెట్టుబడి మోసానికి గురై రూ.8 కోట్లకు పైగా నష్టపోయారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

ఆయన రెండు నెలల పాటు మోసగాళ్ల వలలో చిక్కుకుపోయారని, తన వద్ద డబ్బులు లేకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద రూ.7.5 కోట్ల మేర అప్పు తీసుకున్నారని, ఆ తర్వాత ఆర్థిక, మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. సైబర్ మోసాల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ ఉదంతం తెలియజేస్తోందని పేర్కొన్నారు. నిర్ధారించబడని పెట్టుబడి వేదికలకు, ఆన్‌లైన్‌లో లాభాలను చూపించే ప్రకటనలకు దూరంగా ఉండాలని సూచించారు.

మోసం చేస్తారు ఇలా...

సామాజిక మాధ్యమాల ద్వారా పెట్టుబడి సలహాదారుగా పేర్కొంటూ సందేశం వస్తుంది. మొదట నమ్మకం కలిగించడానికి లాభాలు వచ్చే పెట్టుబడి అవకాశాలను పరిచయం చేస్తారు. ప్రారంభంలో తక్కువ పెట్టుబడి పెట్టాలని సూచిస్తారు. నిత్యం లాభాలను చూపిస్తూ నిజమైన ట్రేడింగ్ జరుగుతున్నట్లు భ్రమ కలిగిస్తారు. మోసపూరితంగా రూపొందించిన వేదికలో నకిలీ లాభాలను చూపించి, అవే నిజమైన లాభాలుగా చెబుతారు.

డబ్బులను ఉపసంహరించుకుంటానని బాధితుడు చెప్పగానే పన్నులు, కరెన్సీ కన్వర్షన్, ఉపసంహరణ ఛార్జీలు, కంప్లయెన్స్ ఛార్జీల పేరుతో చెల్లింపులు చేయాలని అడుగుతారు. చెల్లింపులు జరిపిన ప్రతిసారి కొత్త కారణం చెప్పి మరిన్ని డబ్బులు వసూలు చేస్తారు. బాధితుడికి అనుమానం వచ్చినట్లు గ్రహిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లేదా వాలెట్ ఫ్రీజ్ అవుతుందని భయపెడతారు. సైబర్ మోసమని గ్రహించే వరకు బాధితుడు డబ్బులు చెల్లిస్తూనే ఉంటాడు.

సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులు, ఆఫర్లను విశ్వసించవద్దు. ఎవరైనా సలహాదారులు ఉంటే, వారు సెబి వద్ద రిజిస్ట్రేషన్, లైసెన్స్ కలిగి ఉన్నారో లేదో చూసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెబితే నమ్మవద్దు. సైబర్ నేరగాళ్లు మాత్రమే పన్నులు, ఫీజులు అంటూ వసూలు చేస్తారు. నిజమైన ట్రేడింగ్ వేదికలు ఎప్పుడూ అలా అడగవు. అనుమానాస్పద కార్యకలాపాలు దృష్టికి వస్తే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ లేదా సైబర్ క్రైమ్ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు.
Cyber Crime
Investment fraud
Online trading
Stock trading
Cyber fraud
Hyderabad police

More Telugu News