Chandrababu: ఐటీ విప్లవం తర్వాత క్వాంటం విప్లవం.. దానికి ఏపీనే నాయకత్వం: సీఎం చంద్ర‌బాబు

Chandrababu Envisions Amaravati as Indias Quantum Valley
  • అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమ‌న్న సీఎం
  • వచ్చే రెండేళ్లలో ఏపీలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు ఉత్పత్తి చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌
  • లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక అన్న చంద్ర‌బాబు
  • విశాఖ డేటా సెంటర్ల గ్లోబల్ హబ్‌గా మారుతోందని వ్యాఖ్య 
  • క్వాంటం, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్‌తో ఫ్యూచర్ రెడీ ఏపీ నిర్మాణమ‌ని వెల్ల‌డి
“క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్” కార్యక్రమంలో సీఎం చంద్ర‌బాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. క్వాంటం టెక్నాలజీ, భారత విజ్ఞాన చరిత్ర, దేశ-రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక దిశపై సమగ్రంగా వివరిస్తూ, అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజెంటేషన్ ద్వారా క్వాంటం ప్రోగ్రామ్‌లోని కీలక అంశాలను వివరించిన సీఎం, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్లే.. భారత్‌కు క్వాంటం వ్యాలీగా అమరావతి
25 ఏళ్ల క్రితమే ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేసిన చంద్రబాబు, అదే తరహాలో ఇప్పుడు క్వాంటం రంగంలోనూ ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్లే, భారత్‌కు క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉందని, క్రీస్తుపూర్వం 2500 నాటికే అర్బన్ ప్లానింగ్, జీరో ఆవిష్కరణ, అడ్వాన్స్డ్ అస్ట్రానమీ వంటి రంగాల్లో భారత్ ప్రపంచానికి దారి చూపిందని వివరించారు.

ఒకప్పుడు ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటా భారత్‌దేనని, ‘బంగారు పిచ్చుక’గా పేరొందిన దేశం ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం తర్వాత టెక్నాలజీ ఆధారిత సేవల రంగంలో భారత్ విప్లవం సాధించిందని చెప్పారు. గూగుల్‌కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, ఐబీఎంకు అరవింద్ కృష్ణ వంటి భారతీయులే నాయకత్వం వహించడం దేశ ప్రతిభకు నిదర్శనమన్నారు.

ఇప్పటికే క్వాంటం స్కిల్ ప్రోగ్రామ్‌కు 54 వేల మంది రిజిస్ట్రేషన్
ఏపీ అభివృద్ధి ప్రణాళికలను వివరించిన సీఎం, అమరావతిని నాలెడ్జ్ ఎకానమీ, క్వాంటం వ్యాలీగా, తిరుపతిని స్పేస్ సిటీగా, విశాఖను డేటా సెంటర్ల గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో అమరావతిలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తి ప్రారంభిస్తామని, లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే క్వాంటం స్కిల్ ప్రోగ్రామ్‌కు 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం యువత ఆసక్తికి నిదర్శనమన్నారు.

ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు  
క్వాంటం కంప్యూటింగ్ వైద్యం, విద్యుత్, వ్యవసాయం, వాతావరణ అంచనాలు, మెటీరియల్స్ డిస్కవరీ వంటి రంగాల్లో మానవాళికి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని చెప్పారు. ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించిన విష‌యాన్ని గుర్తు చేసిన సీఎం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తామ‌న్నారు. 'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్'ను భారతీయులు అందిపుచ్చుకోవాలని, ఏపీ ఏ టెక్నాలజీ విప్లవానికైనా నాయకత్వం వహిస్తుందన్నారు. విద్యార్థులు ఈ విజన్‌ను అందిపుచ్చుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Chandrababu
Andhra Pradesh
Quantum Technology
Amaravati
Quantum Valley
IT Revolution
Indian Economy
Skill Development
Quantum Computing
Nobel Prize

More Telugu News