ICICI Bank: కొత్త ఏడాదిలో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ పై కొత్త బాదుడు

ICICI Credit Card Charges on UPI Wallet and Gaming Transactions
  • ఆన్ లైన్ గేమింగ్, వ్యాలెట్ లోడింగ్ లావాదేవీలపై చార్జీలు
  • రివార్డు పాయింట్ల విషయంలోనూ మార్పులు
  • బ్యాంకుకు వెళ్లి నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లిస్తే రూ.150 కట్టాల్సిందే
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్న వారికి కొత్త ఏడాదిలో చార్జీల మోత మోగనుంది. ఆన్ లైన్ గేమింగ్, యూపీఐ వ్యాలెట్ లలో నగదు జమ చేస్తే చార్జీ వసూలు చేయనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. క్రెడిట్ కార్డ్ చార్జీలలో పలు మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. రివార్డు పాయింట్ల విషయంలోనూ పలు మార్పులు చేయనుంది. వచ్చే ఏడాది జనవరి– ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ మార్పులను విడతలవారీగా అమలులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. 

ఆనై లైన్ గేమింగ్ ప్లాట్ ఫారమ్ లలో జరిపే క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2 శాతం, అమెజాన్ పే, పేటీఎం వంటి వ్యాలెట్లలో రూ.5 వేల కంటే ఎక్కువ నగదును లోడ్ చేస్తే 1 శాతం, రూ. 50 వేలకు మించి చేసే ట్రావెలింగ్ ఖర్చులపై 1 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఐసీఐసీఐ తెలిపింది. అంతేకాదు, ఐసీఐసీఐ బ్రాంచ్ లలో క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే రూ.150 అదనంగా సమర్పించుకోవాల్సిందే. 

'ఎమెరాల్డ్ మెటల్' వంటి ప్రీమియం కార్డ్ ద్వారా ప్రభుత్వ సేవలు, ఫ్యూయెల్, రెంట్, పన్ను, వ్యాలెట్ లావాదేవీలు జరిపినపుడు గతంలో కస్టమర్లు రివార్డు పాయింట్లు పొందేవారు. ఇకపై ఈ రివార్డులు పూర్తిగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. రవాణా ఖర్చుల కోసం కార్డు వాడితే నెలకు రూ.20 వేల వరకు మాత్రమే రివార్డ్ పాయింట్లు పొందవచ్చని వివరించింది. యాడ్ ఆన్ కార్డు కోసం రూ.3,500 వసూలు చేయనున్నట్లు పేర్కొంది.

బుక్ మై షోలో 'ఒకటి కొంటే ఒకటి ఉచితం' ఆఫర్ పొందాలంటే గడిచిన మూడు నెలల్లో కార్డుపై కనీసం రూ.25 వేలు ఖర్చు చేసి ఉండాలని బ్యాంకు షరతు విధించింది. ఇన్ స్టంట్ ప్లాటినం కార్డ్ హోల్డర్లకు ఫిబ్రవరి నుంచి ఈ ఆఫర్ పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
ICICI Bank
ICICI credit card
credit card charges
online gaming
UPI wallet
reward points
credit card bill
Amazon Pay
Paytm

More Telugu News