జగన్ పుట్టినరోజు సందర్భంగా జంతుబలులు.. వైసీపీ కార్యకర్తలపై కేసులు

  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో జంతుబలుల ఘటనలపై పోలీసుల సీరియస్ యాక్షన్
  • బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్లతో జంతు బలి ఇచ్చిన వారిపై కేసుల నమోదు
  • రాజకీయ ఉద్రిక్తతలు, ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా ప్రవర్తించినట్లు గుర్తింపు
  • రాప్తాడు నియోజకవర్గం భానుకోట, కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రంలో ఘటనలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో జంతుబలుల ఘటనలపై పోలీసులు కఠినంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్లతో జంతు బలులు ఇస్తూ ప్రజల్లో భయాందోళనలకు కారణమైన వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.


రాప్తాడు నియోజకవర్గంలోని భానుకోట, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం ప్రాంతాల్లో వేట కొడవళ్లతో పొట్టేళ్లను బలి ఇచ్చి హంగామా సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలు రాజకీయంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు.


ఈ వ్యవహారంపై స్పందించిన అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లా పోలీసులు నిందితులకు పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ నిర్వహించారు. బ్రహ్మసముద్రంలో జంతు బలి ఇచ్చిన వారిని నడిరోడ్డుపై ఊరేగించి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే భానుకోటలోనూ ఇదే తరహాలో కౌన్సిలింగ్ ఇచ్చారు.


జంతు సంక్షేమ చట్టాలతో పాటు పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో పటిష్ఠమైన నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.



More Telugu News