Winston Peters: భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందంపై ఆ దేశ విదేశాంగ మంత్రి తిరుగుబాటు

Winston Peters Criticizes India New Zealand Trade Deal
  • భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
  • ఇది న్యూజిలాండ్‌కు తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్
  • తమ డెయిరీ ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గించలేదని ఆరోపణ
  • ఒప్పందాన్ని చారిత్రక మైలురాయిగా అభివర్ణించిన మోదీ 
భారత్, న్యూజిలాండ్ మధ్య ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై న్యూజిలాండ్ ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఇది ‘స్వేచ్ఛాయుతమైనది కాదు.. నిష్పాక్షికమైనది అసలే కాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది న్యూజిలాండ్‌కు తీవ్ర నష్టం చేకూర్చే ‘బ్యాడ్ డీల్’ అని ఆయన అభివర్ణించారు.

న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ అధినేతగా, సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పీటర్స్ ఈ ఒప్పందంపై ఎక్స్  వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధాన ఎగుమతి రంగమైన డెయిరీ (పాలు, వెన్న, చీజ్) ఉత్పత్తులపై భారత్ ఎటువంటి సుంకాలు తగ్గించలేదని, దీనివల్ల తమ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. డైరీ ఉత్పత్తులు లేని మొదటి వాణిజ్య ఒప్పందం ఇదేనని మండిపడ్డారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ కార్మికులు, విద్యార్థుల వలసలకు న్యూజిలాండ్ భారీగా రాయితీలు ఇచ్చిందని, ఇది తమ దేశ నిరుద్యోగులపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.

ప్రధానుల హర్షం.. మంత్రి అసంతృప్తి
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాత్రం ఈ ఒప్పందాన్ని సమర్థించారు. భారత్ లాంటి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థతో జతకట్టడం వల్ల తమ దేశానికి భారీగా ఉద్యోగాలు, వృద్ధి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఒప్పందాన్ని ఒక ‘చారిత్రాత్మక మైలురాయి’గా అభివర్ణించారు. కేవలం 9 నెలల్లోనే ఈ చర్చలు ముగియడం విశేషమని, రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అవుతుందని మోదీ పేర్కొన్నారు.

త్వరపడి తప్పు చేశారు!
న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి పీటర్స్ మాత్రం తన ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ‘‘మంచి ఒప్పందం కోసం మరికొంత కాలం వేచి చూడాలని మేము కోరినా, మా సంకీర్ణ భాగస్వామి (నేషనల్ పార్టీ) వినకుండా హడావుడిగా తక్కువ నాణ్యత గల ఒప్పందాన్ని కుదుర్చుకుంది’’ అని ఆయన ఆరోపించారు. అయితే, తన వ్యతిరేకత కేవలం ఒప్పందంలోని అంశాలపైనే తప్ప, భారత్ దేశంపై కాదని పీటర్స్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పట్ల తనకు గౌరవం ఉందని, తమ మధ్య ఉన్నది కేవలం అభిప్రాయభేదమేనని ఆయన వివరించారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని, కానీ తమ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి కాదని ఆయన తేల్చి చెప్పారు.

భారత్ తన రైతుల ప్రయోజనాల దృష్ట్యా డైరీ, సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు వంటి సున్నితమైన రంగాలను ఈ ఒప్పందం నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్ ప్రభుత్వంలోని ఈ అంతర్గత విభేదాలు భవిష్యత్తులో ఈ ఒప్పందం అమలుపై ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
Winston Peters
New Zealand
India
Free Trade Agreement
FTA
Christopher Luxon
Dairy Products
Trade Deal
S Jaishankar
Narendra Modi

More Telugu News