డిజిటల్ సంకెళ్లను తెంచుకున్న కర్ణాటక గ్రామం.. రోజూ 2 గంటలు ఫోన్లు, టీవీలు బంద్

  • పిల్లల భవిష్యత్తు కోసం హలగా గ్రామస్థుల ‘డిజిటల్ లాక్‌డౌన్’
  • రోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు 
  • మహారాష్ట్రలో విజయవంతమైన ప్రయోగం స్ఫూర్తిగా నిర్ణయం
నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్, టీవీ లేని జీవితాన్ని ఊహించుకోలేం. ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయి చదువును నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. ఈ 'డిజిటల్ వ్యసనం' నుంచి తమ పిల్లలను కాపాడుకోవడానికి కర్ణాటకలోని బెళగావి తాలూకా హలగా గ్రామస్థులు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ రాత్రి పూట రెండు గంటల పాటు స్వచ్ఛందంగా 'డిజిటల్ లాక్‌డౌన్' పాటిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.


మహారాష్ట్రలో విజయవంతమైన ఒక ప్రయోగాన్ని స్ఫూర్తిగా తీసుకున్న హలగా గ్రామ పంచాయతీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి సైరన్ మోగుతుంది. ఈ శబ్దం వినగానే గ్రామంలోని ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్లను రెండు గంటలపాటు (9 గంటల వరకు) పక్కన పడేస్తారు, టీవీలు ఆపివేస్తారు. ముఖ్యంగా ఎస్ఎస్ఎల్‌సీ (పదో తరగతి) పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు గంటల సమయాన్ని పిల్లలు కేవలం చదువుకే కేటాయిస్తారు.

సాధారణంగా ఈ సమయంలో టీవీ సీరియల్స్‌కు అలవాటు పడే మహిళలు కూడా పిల్లల భవిష్యత్తు కోసం వాటిని త్యాగం చేసి ఈ డిజిటల్ విరామంలో భాగస్వామ్యం కావడం విశేషం. పిల్లలు పక్కదారి పట్టకుండా, ఏకాగ్రతతో చదువుకునేలా తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

"పిల్లల విద్య కోసం తీసుకున్న అతి ముఖ్యమైన అడుగు ఇది. వారిలో క్రమశిక్షణను పెంచడంతో పాటు, మితిమీరిన స్క్రీన్ టైమ్ వల్ల కలిగే అనర్థాల నుండి వారిని కాపాడాలనుకుంటున్నాం" అని గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు  ఒకరు తెలిపారు. రోజూ రెండు గంటల పాటు డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండటం వల్ల పిల్లలు చదువుపై మెరుగ్గా దృష్టి సారిస్తున్నారని స్థానికుడు రోహిత్ యల్లూర్కర్ సంతోషం వ్యక్తం చేశారు. సాంకేతికతకు బానిసలవుతున్న నేటి సమాజానికి హలగా గ్రామం మార్గదర్శకంగా నిలుస్తోంది.


More Telugu News