విదేశాలకు భారత విద్యార్థుల క్యూ... నీతి ఆయోగ్ నివేదికలో కీలక విషయాలు

  • విదేశాల్లో 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు
  • చదువులకు టాప్ డెస్టినేషన్‌గా నిలిచిన కెనడా
  • భారత్‌కు భారీగా తప్పని బ్రెయిన్ డ్రెయిన్ సమస్య
  • విదేశీ విద్యపై ఏటా రూ. 2.9 లక్షల కోట్ల వ్యయం
భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 18-23 ఏళ్ల వయసు యువత (సుమారు 15.5 కోట్లు) భారత్ లోనే ఉన్నప్పటికీ, విదేశీ విద్యపై ఆధారపడటం ఎక్కువవుతోందని నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 2024 నాటికి 13.35 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.

భారత విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడే దేశాల్లో కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2024లో అత్యధికంగా 4.27 లక్షల మంది విద్యార్థులతో కెనడా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికాలో 3.37 లక్షల మంది, యూకేలో 1.85 లక్షల మంది, ఆస్ట్రేలియాలో 1.22 లక్షల మంది, జర్మనీలో దాదాపు 43,000 మంది భారత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

ఈ నివేదిక 'బ్రెయిన్ డ్రెయిన్' సమస్య తీవ్రతను ఎత్తిచూపింది. 2024లో భారత్‌కు చదువుకోవడానికి వస్తున్న ప్రతి ఒక్క విదేశీ విద్యార్థికి బదులుగా, 28 మంది భారత విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. కేవలం కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లోనే 2023-24 విద్యా సంవత్సరంలో మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం సుమారు రూ. 2.9 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు నివేదిక అంచనా వేసింది.

లాట్వియా, ఐర్లాండ్ వంటి చిన్న యూరోపియన్ దేశాల్లో సైతం భారత విద్యార్థుల వాటా గణనీయంగా ఉండటం గమనార్హం. లాట్వియాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 17.4 శాతం మంది భారతీయులే ఉండగా, ఐర్లాండ్‌లో ఈ సంఖ్య 15.3 శాతంగా ఉంది. ఈ వలసల వల్ల దేశం ప్రతిభావంతులను, విలువైన విదేశీ మారకాన్ని కోల్పోతోందని నివేదిక పేర్కొంది.


More Telugu News