మీరు తప్పు చేసినట్టు నాకు తెలిస్తే చూస్తూ ఊరుకోను: పవన్ కల్యాణ్

  • అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని నేతలకు పవన్ హెచ్చరిక
  • మంగళగిరిలో 'పదవి-బాధ్యత' సమావేశంలో జనసేన నేతలకు దిశానిర్దేశం
  • యువతకు సరైన వేదికగా జనసేనను నిలపాలన్నదే లక్ష్యం
  • జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీని స్థాపించానన్న పవన్
  • పర్యావరణాన్ని కాపాడుతూనే అభివృద్ధి జరగాలని సూచన
నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తే చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జనసేన నిర్వహించిన ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.

"మీకు వచ్చిన పదవులను బాధ్యతగా నిర్వర్తించండి. రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను, అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మీరు తప్పు చేసినట్టు నాకు తెలిస్తే చూస్తూ ఊరుకోను" అని పవన్ తీవ్రంగా హెచ్చరించారు. ఓటమిలో కూడా పార్టీ కోసం బలంగా నిలబడినందువల్లే నేడు అందరికీ పదవులు దక్కాయని ఆయన గుర్తుచేశారు.

యువతకు సరైన వేదిక అందించాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీని స్థాపించానని పవన్ తెలిపారు. "కొత్త పంథాను నమ్ముకొని ఎంతోమంది యువకులు నక్సలైట్లుగా మారారు. సరైన ఐడియాలజీ లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే సలసల మరిగే యువతకు జనసేన ఒక వేదిక కావాలని ఆకాంక్షించాను" అని వివరించారు. కాంగ్రెస్ నుంచి వైసీపీ ఏర్పడినప్పుడు వారికి సిద్ధంగా కేడర్ వచ్చిందని, కానీ జనసేన మాత్రం ప్రతిదీ సొంతంగా నిర్మించుకోవాల్సి వచ్చిందని అన్నారు.

జనసేన సిద్ధాంతం అందరినీ కలుపుకొనిపోయేదే తప్ప విడదీసేది కాదన్నారు. జాతీయ దృక్పథంతోనే తాను ప్రాంతీయ పార్టీని పెట్టానని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడుతూనే అభివృద్ధి జరగాలని, మనం చేసే ప్రతి పని రాజ్యాంగానికి లోబడే ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


More Telugu News