తులం రూ.1.38 లక్షలకు చేరిన బంగారం ధర

  • ఢిల్లీలో రూ.1,685 పెరిగి రూ.1,38,200కు చేరిన పసిడి ధర
  • రూ.2,14,500కు చేరుకున్న కిలో వెండి ధర
  • ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో పెరుగుతున్న ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం బంగారం ధరలు జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,685 పెరిగి రూ.1,38,200కు చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.2,14,500కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లలో బలమైన ర్యాలీ, పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడటంతో బంగారం ధరలు పెరిగాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి ప్రభావం బంగారం, వెండి ధరలపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లోను బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 80 డాలర్లకు పైగా పెరిగి 4,420 డాలర్లకు చేరుకుంది.

అమెరికాలో వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు బలపడటం, ఆర్థిక ఆందోళనలు పెరుగుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. 2025 సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధర దాదాపు 67 శాతం పెరిగింది. భౌగౌళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పసిడి ధరలు ఈ సంవత్సరం పెరిగాయి.


More Telugu News