అమరావతిలో 'ఆవకాయ' ఫెస్టివల్... తేదీలు ఇవే!

  • అమరావతి బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు 'ఆవకాయ' ఫెస్టివల్
  • జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడలో సాంస్కృతిక వేడుకలు
  • సినిమా, సాహిత్యం, కళలను ఒకే వేదికపైకి తీసుకురానున్న ప్రభుత్వం
  • పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో బహిరంగంగా కార్యక్రమాల నిర్వహణ
అమరావతి బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ 'ఆవకాయ' పేరుతో సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ ఫెస్టివల్‌ను జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఈ కార్యక్రమం వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. "తెలుగు నేలపై పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే 'ఆవకాయ'. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ ఉత్సవం లక్ష్యం" అని ఆయన తెలిపారు. ఏపీ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. సాధారణంగా ఇండోర్ హాళ్లకే పరిమితమయ్యే ఇలాంటి కార్యక్రమాలను తొలిసారిగా బహిరంగ ప్రదేశాల్లో, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం 'ఆవకాయ' ప్రత్యేకత అని మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక ఆలోచనలకు కూడా పెద్దపీట వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


More Telugu News