హైదరాబాదులో ముగిసిన శీతాకాల విడిది... ఢిల్లీ పయనమైన రాష్ట్రపతి ముర్ము

  • ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది
  • హైదరాబాద్ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీకి తిరుగుపయనం
  • హకీంపేట ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి
  • పర్యటనలో భాగంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి
హైదరాబాదులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది సోమవారంతో ముగిసింది. ఈ సాయంత్రం హైదరాబాద్ పర్యటనను ముగించుకుని ఆమె ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ బి. శివధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నత స్థాయి సివిల్, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రయాణం సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి హకీంపేట ఎయిర్‌బేస్ వరకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు.

శీతాకాల విడిది కోసం డిసెంబర్ 17న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 19న రామోజీ ఫిల్మ్ సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్‌ల జాతీయ సదస్సును ప్రారంభించారు. 20న బ్రహ్మకుమారీల శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవ సభలో ప్రసంగించారు. 21న రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోమ్’ విందును ఏర్పాటు చేశారు.

ప్రతి ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడం ఆనవాయతీ. ఈ సమయంలో రాష్ట్రపతి నిలయం నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. 1860లో నిర్మించిన ఈ భవనం, 1948లో హైదరాబాద్ భారత్‌లో విలీనమైన తర్వాత రాష్ట్రపతి విడిది కేంద్రంగా మారింది.


More Telugu News