Bunny Vasu: తెలుగు సినిమాల మధ్య డబ్బింగ్‌ మూవీ ఎందుకు? అన్న ప్రశ్నకు నిర్మాత బన్నీ వాసు సమాధానం

Bunny Vasu Explains Why Dubbed Movie Amidst Telugu Releases
  • క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న పలు తెలుగు చిత్రాలు
  • అదే సమయంలో విడుదల అవుతున్న మోహన్ లాల్ డబ్బింగ్ సినిమా
  • ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న గీతా ఆర్ట్స్

క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ నెల 25న తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్‌ పోరు హోరాహోరీగా మారనుంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. అదే తేదీన మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన డబ్బింగ్‌ సినిమా ‘వృషభ’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాల మధ్య డబ్బింగ్‌ మూవీ విడుదలపై ప్రశ్నలు ఎదురవగా.. నిర్మాత బన్నీ వాసు స్పందించారు.


‘వృషభ’ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన బన్నీ వాసు.. ఈ సినిమా వాస్తవానికి రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉందని తెలిపారు. అయితే సీజీ వర్క్‌ పూర్తికాకపోవడంతో విడుదలను డిసెంబర్‌ 25కి వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. నిర్మాణ సంస్థతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అదే తేదీన విడుదల చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు.


అలాగే ఈ చిత్రాన్ని నిర్మించిన కనెక్ట్‌ మీడియా, హిందీలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న పెన్‌ మూవీస్‌ సంస్థలతో తమకు మంచి అనుబంధం ఉందని బన్నీ వాసు తెలిపారు. అంతేకాకుండా మలయాళ ప్రేక్షకుల్లో ‘అల్లు’ కుటుంబానికి ఉన్న ప్రత్యేక అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ సంస్థ విడుదల చేయనుంది.


ఈ సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్న అంశంపైనా ఆయన స్పందించారు. ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఫోకస్‌ చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఆ అవకాశం లేదని తెలిపారు. అల్లు అరవింద్‌ ఇంతకుముందులా యాక్టివ్‌గా ఉండి ఉంటే తాను ముందుకెళ్లేవాడినని పేర్కొన్నారు.


డిసెంబర్‌ 25న విడుదల కానున్న సినిమాల జాబితాలో ఆది సాయికుమార్‌ ‘శంబాల’, రోషన్‌ ‘ఛాంపియన్‌’, శివాజీ–నవదీప్‌ల ‘దండోరా’, అలాగే ‘ఈషా’, ‘పతంగ్‌’, ‘బ్యాడ్‌ గర్ల్స్‌’ వంటి చిత్రాలు ఉన్నాయి. మరోవైపు కన్నడ నటుడు సుదీప్‌ హీరోగా తెరకెక్కిన ‘మార్క్‌’ కూడా అదే రోజున విడుదల కానుండటంతో క్రిస్మస్‌ బాక్సాఫీస్‌ పోరు ఆసక్తికరంగా మారింది.

Bunny Vasu
Vrushabha
Mohanlal
Telugu movies
Dubbing movie
Geetha Arts
Christmas releases
Tollywood box office
Allu Aravind
Film chamber elections

More Telugu News