Sridhar Babu: పెట్టుబడులు రావొద్దన్నట్లుగా కేసీఆర్ నిన్న మాట్లాడారు: మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu slams KCR for discouraging Telangana investments
  • ఒప్పందాలను తక్కువ చేసి మాట్లాడారని విమర్శ
  • అనుభవం కలిగిన నాయకుడిగా సూచనలు చేస్తారని భావించామన్న మంత్రి
  • నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దని బీఆర్ఎస్ కోరుకుంటోందని ఆరోపణ
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దన్నట్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌లో జరిగిన ఒప్పందాలను మాజీ ముఖ్యమంత్రి తక్కువ చేసి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం కలిగిన నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన సూచనలు చేస్తారని తాము భావించామని, కానీ అందుకు భిన్నంగా పెట్టుబడులకు వ్యతిరేకంగా మాట్లాడారని విమర్శించారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దని బీఆర్ఎస్ నాయకత్వం కోరుకుంటున్నట్లుగా ఉందని ఆరోపించారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు కుదిరాయని ఆయన అన్నారు. ఒప్పందం చేసుకున్న ప్రతి సంస్థ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఒప్పందం చేసుకున్న ప్రతి పరిశ్రమ రాలేదని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

అప్పుడు తాము కూడా దానిపై రాజకీయం చేయలేదని అన్నారు. ఏ రాష్ట్రంలో లేనంత స్థాయిలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించామని అన్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చేందుకు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఒక్క ఏడాదిలోనే 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను తీసుకువచ్చామని అన్నారు. అత్యధిక జీసీసీలు వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.

గత ఏడాది రాష్ట్రానికి రూ.3.40 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. కొత్త పెట్టుబడులతో 1.40 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రభుత్వ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రపంచ అవసరాలలో మూడొంతుల వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఎగుమతి అవుతున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు.
Sridhar Babu
Telangana investments
KCR criticism
Global Summit Telangana
Telangana jobs

More Telugu News