బెల్టు షాపుల కట్టడికి హర్యానా మోడల్‌పై అధ్యయనం: సీఎం చంద్రబాబు

  • ఆబ్కారీ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ఆదాయం కాదు... ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలని సూచన
  • లాటరీ విధానం, రిటైలర్ మార్జిన్ పెంపుపై పునఃపరిశీలన 
  • ప్రతీ మద్యం బాటిల్ పైనా ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉండాలని ఆదేశం
రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, ఇంకా... లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు... తదితర అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. 

బార్ ఏఆర్ఈటీ (అడిషనల్ రిటెయిల్ ఎక్సైజ్ టాక్స్) మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సీఎం నిర్దేశించారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్టు షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బెల్టు షాపుల నియంత్రణకు హర్యానా మోడల్‌పై అధ్యయనం చేయాలని నిర్దేశించారు.

సచివాలయంలో సోమవారం నాడు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, ప్రొహిబిషన్-ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్, ఎక్సైజ్ ఈడీ రాహుల్ దేవ్ శర్మ హాజరయ్యారు. కొత్త ఎక్సైజ్ విధానాల అమలు, వాటి ప్రభావంపై సమీక్షలో సమగ్రంగా చర్చించారు. 

అనధికార విక్రయ కేంద్రాలుగా తయారైన బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బెల్టు షాపులు పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి హర్యానాలో అనుసరించిన సబ్ లీజు విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం గ్రామీణ, దూర ప్రాంతాల్లో షాపులు లేకపోవడం వల్ల బెల్ట్ షాపుల సమస్య నెలకొందని అధికారులు చెప్పారు. అలాగే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా... మద్యం వినియోగం అనంతరం బాటిల్ తిరిగి ఇస్తే డీఆర్ఎస్ (డిపాజిట్ రిటర్న్ స్కీమ్) కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

పెరిగిన మద్యం విక్రయాలు 

అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు...రూ.8,000 కోట్లు ఎక్సైజ్ ఆదాయం లక్ష్యం పెట్టుకోగా, రూ.7,041 కోట్లు ఆదాయం వచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52 శాతం పెరుగుదల కనిపించిందని... ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) విక్రయాలు 19.08 శాతం, బీర్ విక్రయాలు 94.93 శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో 3 శాతం పెరుగుదల చూపిస్తామని అధికారులు చెప్పారు. 

35 శాతం డిజిటల్ చెల్లింపులు  

మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు 34.9 శాతం పెరిగాయని, కొన్ని జిల్లాల్లో 40–47 శాతం వరకు డిజిటల్ లావాదేవీలు నమోదైనట్టు వివరించారు. అయితే నగదు వినియోగాన్ని తగ్గించి... డిజిటల్ చెల్లింపులు జరిగేలా అందరిలో అవగాహన పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి మద్యం బాటిల్‌కు ప్రత్యేక లిన్ (లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్) త్వరితగతిన తీసుకురావాలని, సాధారణ ప్రజలు కూడా సులభంగా గుర్తించేలా ఉండాలన్నారు. లిన్‌లో... బ్రాండ్, బ్యాచ్, లైన్‌‌తో పాటు తయారైన తేదీ, గంటలు, నిమిషాలు, సెకన్లు సహా వివరాలు ఉండాలన్నారు. 





More Telugu News