Siddaramaiah: కర్ణాటకలో సీఎం మార్పును డిసైడ్ చేసేది ఆయనే: సీఎం సిద్ధరామయ్య

Siddaramaiah Says Rahul Gandhi Will Decide on Karnataka CM Change
  • కర్ణాటక నాయకత్వ మార్పుపై రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని చెప్పిన సిద్ధరామయ్య
  • అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ
  • సీఎం మార్పుపై పదేపదే ప్రశ్నిస్తున్న మీడియాపై అసహనం వ్యక్తం చేసిన సీఎం
  • డీకే శివకుమార్‌తో రాజన్న భేటీని సమర్థించిన ముఖ్యమంత్రి
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించేలా సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎం మార్పు రగడపై అగ్రనేత నేత రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికే తామంతా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం తన సొంతూరు మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం మార్పుపై మీడియా పదేపదే చర్చించడంపై సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. "ఈ విషయంపై ఇన్ని ప్రశ్నలు ఎందుకు? నేను ఇప్పటికే శాసనసభలో దీని గురించి మాట్లాడాను. మళ్ళీ చర్చ అనవసరం" అని అన్నారు. తాను పూర్తికాలం సీఎంగా కొనసాగుతానని ఇటీవల అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సిద్ధరామయ్య, తాజా వ్యాఖ్యలతో బంతిని అధిష్ఠానం కోర్టులోకి నెట్టారు.

గతవారం మంత్రి కేఎన్ రాజన్న, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయిన విషయంపై అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య స్పందిస్తూ.. "డీకే శివకుమార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన్ను కలవడంలో తప్పేముంది?" అని ప్రశ్నించారు.

మరోవైపు, సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ఆధిపత్య పోరుపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానానికి ఈ సమస్యను పరిష్కరించే సత్తా లేదని ఎద్దేవా చేస్తోంది. ఈ వారంలో డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండటం, శనివారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సిద్ధరామయ్యకు ఆహ్వానం అందే అవకాశం ఉండటంతో.. కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి.
Siddaramaiah
Karnataka CM
Rahul Gandhi
DK Shivakumar
Karnataka Politics
Congress Party
Chief Minister Change
KN Rajanna
Congress Working Committee
Mysuru

More Telugu News