ఢిల్లీ హైకోర్టులో పవన్, ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై విచార‌ణ‌.. కీలక ఆదేశాలు జారీ

  • తమ ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వినియోగంపై కోర్టుకెక్కిన స్టార్లు
  • తార‌క్‌, ప‌వ‌న్‌ తరఫున వాదనలు వినిపించిన‌ సీనియర్ న్యాయవాది సాయి దీపక్
  • ఈ వ్యవహారాన్ని పరిశీలించిన‌ జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టాలీవుడ్ అగ్రహీరో ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. సోష‌ల్ మీడియాలో తమ ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల కోసం వినియోగించడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం క‌లుగుతోందని పవన్, తార‌క్ త‌మ‌ పిటిషన్లలో పేర్కొన్నారు. వీరిద్దరి తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. 

మార్ఫింగ్ ఫొటోలు, అవమానకర పోస్టులు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుల్లో అమెజాన్, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే కొన్ని లింకులను తొలగించినట్లు ప్రతివాదులు కోర్టుకు వివరించారు. అయితే, తొలగించిన లింకులపై ఆదేశాలు జారీ చేయడానికి ముందు సంబంధిత ఖాతాదారులకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది.

గూగుల్ తమ వినియోగదారులకు ఈ విషయాన్ని తెలియజేయాలని లేదా ఖాతాలను నిలిపివేయాలని ఆదేశించింది. సంబంధిత బీఎస్ఐ, ఐపీ లాగిన్ వివరాలను మూడు వారాల్లోగా అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది.


More Telugu News