Sambalpur: రన్‌వేపై హోంగార్డ్‌ సెలెక్షన్స్‌ పరీక్ష... 8 వేల‌ మందికి పైగా హాజరు... వైర‌ల్ వీడియో!

Sambalpur Home Guard Selection Exam on Runway Goes Viral
  • ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఘ‌ట‌న‌
  • 187 హోంగార్డు పోస్టులకు ఏకంగా 8వేల మందికిపైగా అభ్యర్థుల హాజరు
  • అంత మందికి రాత‌ పరీక్ష నిర్వహించడం పోలీసులకు సవాల్‌గా మారిన వైనం
  • దాంతో ఏకంగా రన్‌వేపై వారికి రాత పరీక్ష నిర్వహణ‌
ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో హోంగార్డ్ సెలెక్ష‌న్స్ ప‌రీక్ష‌లో వింత‌ సంఘటన, దాని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 200లోపు ఉన్న హోంగార్డు పోస్టుల సెలెక్షన్స్‌కు ఏకంగా 8వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో అంత మందికి రాత‌ పరీక్ష నిర్వహించడం పోలీసులకు సవాల్‌గా మారింది. దాంతో ఏకంగా రన్‌వేపై వారికి రాత పరీక్ష నిర్వహించారు. 

ఈ నెల‌ 16న ఉదయం జమదర్‌పాలిలోని రన్‌వేపై అభ్యర్థులకు ఇలా రాత పరీక్ష నిర్వహించారు పోలీసులు. దీంతో ఆ రన్‌వే పొడవునా వేలాది మంది అభ్యర్థులు వరుసగా కూర్చొని పరీక్ష రాశారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, భద్రత కోసం భారీగా పోలీస్‌ అధికారులు, సిబ్బందిని మోహరించారు. ముగ్గురు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, 24 మంది ఇన్‌స్పెక్ట‌ర్లు, 86 మంది సబ్-ఇన్‌స్పెక్ట‌ర్లు, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్ట‌ర్లతో పాటు 100 మందికి పైగా హోమ్ గార్డ్లు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించింది. అలాగే అభ్యర్థుల పరీక్షను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

187 హోంగార్డుల పోస్టుల భర్తీకి కనీస అర్హత 5వ తరగతి ఉత్తీర్ణత. అయితే, ఉన్నత విద్యావంతులు వేల సంఖ్యలో దరఖాస్తు చేశారు. సంబల్‌పూర్ జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, ఎంబీఏ చదివినవారు, డిప్లొమా హోల్డర్లు, ఐటీఐ శిక్షణ పొందిన అభ్యర్థులు హోంగార్డు ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. దీంతో ఒడిశాలో నిరుద్యోగ సమస్యకు ఈ ఘ‌ట‌న‌ అద్దంపట్టిన‌ట్లైంది. ఇక‌, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజన్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 
Sambalpur
Home Guard Selections
Odisha
Runway Exam
Unemployment
Police
Viral Video
Government Job
Recruitment
Home Guard

More Telugu News