అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌... పాక్ బౌలర్‌కు షూ చూపించి బదులిచ్చిన వైభవ్!

  • అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో వాడీవేడి క్షణాలు 
  • వైభవ్ ను స్లెడ్జింగ్ చేసిన పాక్ బౌలర్
  • షూ చూపిస్తూ బదులిచ్చిన వైభవ్
అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాకిస్థాన్ పేసర్ అలీ రజా రెచ్చగొట్టేలా ప్రవర్తించడంతో, భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన షూ వైపు చూపిస్తూ గట్టిగా బదులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో భారత్‌పై గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది.

దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో డిసెంబర్ 21న జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, సమీర్ మిన్హాస్ అద్భుత సెంచరీతో (113 బంతుల్లో 172) చెలరేగడంతో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3, ఖిలన్ పటేల్ 2 వికెట్లు తీశారు.

భారీ లక్ష్య ఛేదనలో, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 10 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 26 పరుగులు చేశాడు. అయితే, అలీ రజా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో ఓవర్‌లో వెనుదిరిగాడు. వైభవ్ అవుటైన తర్వాత అలీ రజా దూకుడుగా ప్రవర్తిస్తూ అతడిని స్లెడ్జింగ్ చేశాడు. దీనికి ఏమాత్రం వెనక్కి తగ్గని వైభవ్, తన షూ వైపు సైగ చేస్తూ ఘాటుగా స్పందించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అనంతరం భారత బ్యాటింగ్ లైనప్ పాక్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. అలీ రజా 4 వికెట్లతో చెలరేగాడు. సమీర్ మిన్హాస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు లభించాయి. పాకిస్థాన్‌కు ఇది రెండో అండర్-19 ఆసియా కప్ టైటిల్.


More Telugu News