చంద్రబాబును ఓసారి గురువు అంటారు, మరోసారి కాదంటారు: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శ

  • చంద్రబాబు మీ గురువు అని మేం అంటే రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడన్న హరీశ్ రావు
  • మొన్న వెంకయ్యతో స్వయంగా చంద్రబాబే తన గురువు అని అంగీకరించాడని వెల్లడి
  • ఓసారి దేవత అంటారు, మరోసారి బలిదేవత అంటారని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువు అని అంటే ఆయన తమపై విమర్శలు చేస్తారని, కానీ మొన్న మాజీ ఉపరాష్ట్రపతిని కలిసి చంద్రబాబే తన గురువు అని చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఒకసారి చంద్రబాబు నీ గురువు అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తావు, మరోసారి తానే స్వయంగా నా గురువు అని అంగీకరిస్తాడని, దేవత అంటారు, బలిదేవత అంటారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని అన్నారు.

జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా కేసీఆర్ నిలిపారని అన్నారు. మూడు రెట్ల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం పెరిగిందని వెల్లడించారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి అయి రెండేళ్లైనా ఇంకా ప్రిపేర్ కాకుండా సభకు వస్తున్నారని విమర్శించారు. ఆయన సగం సగం ప్రెస్ మీట్లు పెట్టి పరువు తీస్తున్నారని అన్నారు.

కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటికే రేవంత్ రెడ్డి తన ఇంట్లోనే మీడియాతో చిట్‌చాట్ పెట్టారని అన్నారు. దీనితోనే ఆయనది ఎంత మరుగుజ్జు మనస్తత్వమో వెల్లడవుతోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వం పెరిగిందని రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయవద్దని కోరారు.

సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటూ ఎదిగినట్లు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని హరీశ్ రావు అన్నారు. రూ.50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుగోలు చేసినట్లు గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారని గుర్తు చేశారు. నిజాయతీగా, త్యాగాల పునాదులపై ఎదిగిన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీది అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులను గడ్డిపోచల్లా త్యాగాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నేతలదని అన్నారు.


More Telugu News