ఆసియా క‌ప్ విజేత‌లకు ఘ‌న స్వాగ‌తం.. ఇస్లామాబాద్ వీధుల్లో మోతమోగిపోయిన డ్రమ్స్

  • అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భార‌త్‌పై పాకిస్థాన్ ఘ‌న విజ‌యం 
  • 191 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించిన దాయాది జ‌ట్టు
  • ఈ విజయంతో పాకిస్థాన్‌లో అంబ‌రాన్నంటిన సంబ‌రాలు 
  • స్వ‌దేశంలో ఆట‌గాళ్ల‌కు ఘ‌న స్వాగ‌తం.. ఇస్లామాబాద్‌లో విజయోత్సవ ర్యాలీ
దుబాయ్‌లో నిన్న‌ జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భార‌త్‌పై పాకిస్థాన్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఫైనల్‌లో దాయాది జ‌ట్టు పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి 191 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. త‌ద్వారా రెండోసారి అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇక‌, ఈ విజయంతో పాకిస్థాన్‌లో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. 

ఈ క్ర‌మంలో విజేత‌గా నిలిచిన‌ పాక్ జ‌ట్టు స్వ‌దేశానికి చేరుకోగా.. ఇస్లామాబాద్ విమానాశ్ర‌యంలో ఘన స్వాగతం లభించింది. పాక్ అభిమానులు త‌మ ప్లేయ‌ర్ల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ చేసుకున్న‌ సంబరాల తాలూకు వీడియోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇస్లామాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అభిమానులు డ్రమ్స్ తో మోత మోగించారు. దాంతో ఇస్లామాబాద్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఇస్లామాబాద్ వీధుల్లో అభిమానుల‌ సంబరాల‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

ఇక‌, మ్యాచ్ విష‌యానికి వ‌స్తే... తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 347/8 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జ‌ట్టులో సమీర్ మిన్హాస్ 113 బంతుల్లోనే 172 పరుగుల‌తో భార‌త బౌల‌ర్ల‌ను బెంబెలేత్తించాడు. 

అనంత‌రం భారీ టార్గెట్ ఛేదనలో యువ భార‌త్ పూర్తిగా త‌డ‌బ‌డింది. సూర్యవంశీ, కెప్టెన్‌ ఆయుష్ మాత్రే, అభిజ్ఞాన్ కుందు లాంటి స్టార్ బ్యాటర్లు త్వ‌ర‌గా పెవిలియ‌న్ చేర‌డంతో టీమిండియా 26.2 ఓవర్లలో కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో 191 పరుగుల భారీ తేడాతో భార‌త జ‌ట్టు ఘోర ప‌రాజయాన్ని చ‌విచూసింది.  


More Telugu News