KCR: కేసీఆర్ బయటకు రావడానికి కారణం ఇదే: జూపల్లి కృష్ణారావు

KCR Came Out to Save BRS Party Says Jupally Krishna Rao
  • సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలిందన్న జూపల్లి
  • పార్టీ బలహీనమయిందనే కేసీఆర్ బయటకు వచ్చారని ఎద్దేవా
  • బీఆర్ఎస్ కు కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలిందని వ్యాఖ్య
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు సెటైర్లు వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలిందని... పార్టీ బలహీనమయిందని గ్రహించే కేసీఆర్ ఫామ్ హౌస్ ను వదిలి ఇప్పుడు బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిఫరెండం అని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై కేసీఆర్, కేటీఆర్ చేసిన ఆరోపణలు తప్పు అంటూ ప్రజలు తీర్పును వెలువరించారని చెప్పారు. కేసీఆర్ బయటకు వచ్చింది ప్రాజెక్టుల కోసం కాదని... పార్టీని కాపాడుకోవడం కోసమేనని అన్నారు. 

ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్... వచ్చీ రాగానే తోలు తీస్తానని అంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి తోలు మాత్రమే మిగిలిందని, కండలు కరిగిపోయాయని అన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేయడం తమ ప్రభుత్వ సమర్థత అని చెప్పారు. 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్... పదేళ్ల పాలనలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసినా ఒక ఎకరాకు కూడా కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తాగునీటి ప్రాజెక్టు అంటూ సుప్రీంకోర్టులో కేసు వేసిన కేసీఆర్... ఇప్పుడు ఆ ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టు అంటున్నారని దుయ్యబట్టారు.
KCR
KCR BRS
Jupally Krishna Rao
BRS party
Telangana politics
Jubilee Hills election
Sarpach elections
Palamuru Rangareddy project
Telangana government
Congress party

More Telugu News