Karnataka honor killing: గర్భిణీ అని కూడా చూడకుండా కన్నకూతురిని కొట్టి చంపిన తండ్రి.. కర్ణాటకలో పరువు హత్య

Pregnant Woman Manya Patil Murdered by Father in Karnataka
  • కులాంతర వివాహం చేసుకున్న కూతురిని చంపిన తండ్రి
  • కూతురి అత్తవారింట్లోకి చొరబడి ఇనుప రాడ్లతో దాడి
  • అడ్డుకున్న అత్త, ఆడపడుచులపైనా ధాష్టీకం
కర్ణాటకలోని హుబ్బళ్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వద్దన్నా వినకుండా కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఓ తండ్రి తన కూతురినే హత్య చేశాడు. గర్భవతి అని కూడా చూడకుండా బంధువులతో కలిసి ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టి చంపాడు. అడ్డుకున్న కూతురు అత్త, ఆడపడుచులపైనా దాడి చేశాడు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు..

హుబ్బళ్లి జిల్లాకు చెందిన 19 ఏళ్ల మన్య పాటిల్ వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. కుటుంబ సభ్యులను ఎదిరించి ఈ ఏడాది మే నెలలో వివాహం చేసుకుంది. తండ్రి ప్రకాశ్ ఫక్రిగోడాకు భయపడి ఆ జంట స్వగ్రామానికి దూరంగా నివసిస్తోంది. అయితే, మన్య గర్భం దాల్చడంతో ఈ నెల 8న భార్యాభర్తలు ఇద్దరూ సొంతూరుకు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం పొలంలో పనిచేస్తున్న మన్య భర్త, మామలపై ఆమె తండ్రి ప్రకాశ్ దాడి చేశాడు.

బంధువులతో కలిసి దాడికి వచ్చిన ప్రకాశ్ నుంచి ఆ తండ్రీకొడుకులు తప్పించుకున్నారు. తిరిగి సాయంత్రం ప్రకాశ్, మరో ముగ్గురు బంధువులతో కలిసి మన్య అత్తగారింటికి వెళ్లాడు. ఇంట్లోకి చొరబడి మన్యపై ఇనుప రాడ్లతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన మన్య అత్త, ఆడపడుచును కూడా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మన్య.. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. తీవ్రంగా గాయపడ్డ మన్య అత్త, ఆడపడుచు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మన్య భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Karnataka honor killing
Hubli murder
inter caste marriage
pregnant woman killed
family violence
crime news
India crime
police investigation
domestic violence

More Telugu News