: అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్‌ లో మందిర్- మసీద్ రాజకీయాలు

  • బాబ్రీ మసీదు నిర్మిస్తానన్న టీఎంసీ బహిష్కృత నేత
  • కృష్ణుడి మందిరం నిర్మిస్తానన్న టీఎంసీ ఎమ్మెల్యే ప్రకటన
  • రాజకీయ లబ్ది కోసం టీఎంసీ ఆడుతున్న నాటకమని బీజేపీ ఫైర్
పశ్చిమ బెంగాల్‌ లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మత రాజకీయాలు మొదలయ్యాయి. టీఎంసీ నేతలు మందిర్- మసీద్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేత, అయోధ్య బాలరాముడి ఆలయ నిర్మాణం నేపథ్యంలో ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీదును నిర్మిస్తానని టీఎంసీ నేత హుమాయున్ కబీర్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో హుమాయున్ పై మండిపడ్డ టీఎంసీ అధిష్ఠానం.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ మసీదు నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గేదిలేదని కబీర్ ప్రకటించారు.

విరాళాల కోసం ఆయన ఇచ్చిన పిలుపుకు ముస్లిం కమ్యూనిటీ నుంచి భారీ స్పందన లభించింది. ఇదిలా ఉండగా.. బాబ్రీ మసీదు నిర్మాణ ప్రకటన తర్వాత తాజాగా ముర్షిదాబాద్ జిల్లా జంగీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ తన నియోజకవర్గంలో కృష్ణ దేవాలయాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. తన నియోజకవర్గంలో మత సామరస్యానికి ప్రతీకగా రూ. కోటి వెచ్చించి ఆలయం నిర్మిస్తానని తెలిపారు. ముస్లిం వర్గానికి చెందిన ఎమ్మెల్యే హిందూ దేవాలయం నిర్మిస్తానని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.

హిందూ ఓటర్లను మభ్యపెట్టేందుకే.. బీజేపీ
ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ ఆలయ నిర్మాణ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం మండిపడింది. రాబోయే ఎన్నికల్లో హిందూ ఓటర్లను మభ్యపెట్టడానికే టీఎంసీ ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించింది. "ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు లేని భక్తి, ఎన్నికల ముందు మాత్రమే ఎందుకు గుర్తొచ్చింది?" అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది భక్తితోనో మత సామరస్యం కోసమో చేస్తున్న పని కాదని, కేవలం 'వోట్ బ్యాంక్' రాజకీయమేనని వారు ఆరోపించారు.

అన్ని మతాలను గౌరవిస్తాం.. టీఎంసీ
ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అన్ని మతాలను గౌరవించడమే తమ ఉద్దేశమని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ముర్షిదాబాద్ వంటి కీలక ప్రాంతంలో ఇలాంటి ప్రకటనలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News