'ధురంధర్'లో తమన్నాను అందుకే తీసుకోలేదట!
- బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'ధురంధర్'
- 'శరరత్' పాటకు తొలుత తమన్నాను తీసుకోవాలనుకున్న కొరియోగ్రాఫర్
- ఈ ఆలోచనను అంగీకరించని దర్శకుడు ఆదిత్య ధర్
- కథ ప్రవాహానికి తమన్నా గ్లామర్ అడ్డుగా మారే ప్రమాదం ఉందని భావించిన ఆదిత్య
రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్’ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. సినిమా కథతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమాల్లో ఎక్కువగా చర్చకు వచ్చిన పాట “శరరత్”. ఈ పాట గురించి తాజాగా బయటకు వచ్చిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్‌లో మొదటిగా స్టార్ హీరోయిన్ తమన్నా పేరు పరిశీలనలోకి వచ్చిందని సమాచారం.
అయితే ఈ విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఒక ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ మాట్లాడుతూ, “శరరత్” పాటకు తమన్నాను ఎంపిక చేస్తే బాగుంటుందని నేను సూచించినప్పటికీ, దర్శకుడు మాత్రం ఇందుకు అంగీకరించలేదని వెల్లడించారు.
ఆదిత్య ధర్ అభిప్రాయం ప్రకారం, తమన్నా లాంటి స్టార్ ఈ పాటలో కనిపిస్తే ప్రేక్షకుల దృష్టి కథపై కాకుండా, ఆమె డ్యాన్స్, గ్లామర్‌పైనే కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందట. దాంతో ఈ పాట కథ ప్రవాహానికి అడ్డుగా మారే ప్రమాదం ఉందని ఆయన భావించారట. ఈ కారణంతోనే ఈ సాంగ్‌ను సాధారణ కమర్షియల్ ఐటమ్ నెంబర్‌గా మార్చకుండా, కథలో సహజంగా కలిసిపోయేలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడట.
అదే ఆలోచనతో, స్టార్ ఇమేజ్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే ఇద్దరు యువ నటీమణులు అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజాలను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల “శరరత్” పాట కథలో భాగంగా ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అయిందని సినీ వర్గాలు అంటున్నాయి.
‘జైలర్’లో 'కావాలయ్య' వంటి పాటలతో తమన్నా సృష్టించిన హవా గుర్తొస్తున్నా, ఈ సినిమాకు అవసరమైన టోన్‌కు అనుగుణంగా దర్శకుడు తీసుకున్న నిర్ణయం సరైనదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కథకే ప్రాధాన్యం ఇచ్చే ఈ విధమైన ఆలోచనలే ‘ధురంధర్’ను బాక్సాఫీస్ హిట్‌గా నిలబెట్టాయని చెప్పుకుంటున్నారు.