KCR: రెండేళ్లు ఆగాం... ఇక ఆగేది లేదు: కేసీఆర్

KCR Warns Congress Government on Telangana Projects
  • సుదీర్ఘకాలం తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్
  • ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని హెచ్చరిక
  • భూములు అమ్మడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని విమర్శలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరించారు. రెండేళ్లు ఆగామని, ఇక ఆగేది లేదని, ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది... ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. భూములు అమ్మడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఉపేక్షించేది లేదని, రాష్ట్రాన్ని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. 

తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు ముందుకు వెళ్లడంలేదు, ఎవరి కుట్ర ఉంది... ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగడతామని కేసీఆర్ హెచ్చరించారు. గోదావరి నీళ్ల దోపిడీపై ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా ఏపీ 80 టీఎంసీల గోదావరి నీటిని వాడుకుంటోందని అన్నారు. బచావత్ ట్రైబ్యునల్ ద్వారా ఎగువ రాష్ట్రాలకు ఆ 80 టీఎంసీలు ఇస్తామని ఏపీ చెప్పిందని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర చెరో 20 టీఎంసీలు వాడుకుంటున్నాయని... బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను పట్టించుకున్న వారే లేరని విచారం వ్యక్తం చేశారు. 40 టీఎంసీలు చాలని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. 

నాడు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరుకు ద్రోహం చేశాయని ఆరోపించారు. ఎంత దద్దమ్మ ప్రభుత్వం అయినా పాత ప్రాజెక్టులు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఇక మౌనంగా ఉండేదిలేదని, బహిరంగ సభలు నిర్వహించి నీళ్ల కోసం నిలదీస్తామని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన మోసం నుంచి ఇప్పటికైనా బయటపడాలంటే, కొట్లాడి మన నీటి వాటా సాధించుకోవాలని అన్నారు. 

ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడని వెల్లడించారు. కానీ అభివృద్ధి పేరిట ఇష్టానుసారం పునాదిరాళ్లు వేశారే కానీ, అభివృద్ధి మాట మరిచారని విమర్శించారు. ఆ పునాది రాళ్లన్నీ కలిపితే ఒక ప్రాజెక్టు పూర్తవుతుందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఒక్క చుక్క నీరు కూడా పొలాల్లోకి పారలేదని, దాంతో పాలమూరు నుంచి ముంబైకి వలసలు పెరిగాయని వివరించారు. ఆనాడు తాను నిలదీయబట్టే చంద్రబాబు జూరాల ప్రాజెక్టు నిర్మించాడని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ టీడీపీ ఎమ్మెల్యే బాంబులతో ఆర్డీఎస్ కాలువను పేల్చేశాడని తెలిపారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పెద్ద శాపంలా మారిందని, మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగిందని కేసీఆర్ వెల్లడించారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణకు శనిలా దాపురించిందని అన్నారు. 
KCR
KCR press meet
BRS party
Telangana projects
Godavari water
Pattiseema project
Congress government
Revanth Reddy
Telangana irrigation
Mahabubnagar district

More Telugu News