Nara Bhuvaneshwari: వారి సహకారంతోనే 29 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు చేపడుతున్నాం: నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari NTR Trust Conducting Programs for 29 Years
  • అల్లూరి జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరం
  • ప్రారంభించిన నారా భువనేశ్వరి
  • ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు సేవలు అందిస్తున్నామని వెల్లడి
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్పూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. 

ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కార్పొరేట్ ఆసుపత్రులకు సిఫారసు చేస్తాం

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు చేయూత అందిస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. "అన్న ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు ట్రస్ట్ ప్రారంభించారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించాలని ట్రస్టును ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా నేను కూడా ట్రస్టీగా ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నాను. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఈ మహత్తర కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు ముందుకొచ్చి తమవంతు సహకారం అందిస్తున్నారు" అని భువనేశ్వరి అన్నారు. 

ప్రజలు, దాతల సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు విజయవంతం

ట్రస్ట్ ఏర్పాటు చేశాక రెండు తెలుగు రాష్ట్రాల్లో 16,365 హెల్త్ క్యాంపులు నిర్వహించి 22.64 లక్షల మంది వైద్య సేవలు అందించామని భువనేశ్వరి అన్నారు. వైద్య పరీక్షల అనంతరం రూ.22.97 కోట్ల విలువైన మందులను బాధితులకు పంపిణీ చేశామన్నారు. 

"మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపులు ద్వారా వైద్య సేవలు అందించాం. అలాగే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనాథ పిల్లలను కూడా చదివిస్తున్నాం. పేదపిల్లలకు రూ.3.5 కోట్లు స్కాలర్ షిప్‌లతో పాటు మరో 4,297 మంది కాలేజీ విద్యార్థులకు రూ.2.70 కోట్లు ఆర్థిక సాయం అందించాం. వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రిలో 4 బ్లడ్ బ్యాంకులు ద్వారా 5 లక్షల యూనిట్లు సేకరించి 9.18 లక్షల మందికి రక్తం అందించాము. దాతలు మాపై ఉంచిన నమ్మకమే మా బలం" అని భువనేశ్వరి తెలిపారు. 

ఆదివాసీలకు ఎన్టీఆర్ బతుకుదెరువు చూపించారు : ఎమ్మెల్యే శిరీషాదేవి 

వెనకబడ్డ తమ ప్రాంతంలో ఇన్ని రకాల ఉచిత సేవలు అందించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి 
అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సికెల్ సెల్ వ్యాధి ఎక్కువగా ఉందని, ఈ వ్యాధికి రక్తం ఎక్కిస్తూనే ఉండాలని తెలిపారు. ఈ నేపథ్యంలో రంపచోడవరంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భువనేశ్వరిని కోరగానే సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

"ఎన్టీఆర్ ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే బస చేశారు. గిరిజనుల జీవన పరిస్థితులు చూసి జీడి మామిడి మొక్కలు అందించి ప్రోత్సహించారు. అరకులో కాఫీ పంటలు ఎలాగో ఇక్కడ జీడి ఫేమస్. ఉండటానికి ఇళ్లు, తినడానికి తండి, కట్టుకోవడానికి బట్ట అందించారు. కిలో బియ్యం రెండు రూపాయలకు పేదలను దృష్టిలో పెట్టుకుని చేసిన కార్యక్రమమే. ఆదివాసీలకు ఎన్టీఆర్ బతుకుదెరువు చూపించారు" అని ఎమ్మెల్యే మిరియాల శిరిషా అన్నారు. 

మెగా వైద్య శిబిరంలో ఉచితంగా 12 రకాల వైద్య సేవలు

వైద్య శిబిరంలో 12 రకాల ఉచిత సేవలను అందించారు. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, యూరాలజీ, ఆంకాలజీ డెర్మటాలజీ, పల్మనాలజీ, కంటి, దంత చికిత్సలు, మహిళా, పిల్లల వైద్యం వంటి 12 రకాల సేవలను భువనేశ్వరి ప్రారంభించారు. జీఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి డాక్టర్ల ద్వారా న్యూరాలజీ, మెదడు, వెన్నుపూస, నరాల సేవలను కూడా ప్రారంభించారు. న్యూట్రిఫిల్ ద్వారా జీవన శైలి, హైజీన్, మధుమహం, రక్తపోటు, పోషకాహార మార్గదర్శకాలు, పిల్లల వృద్ధి, బరువు, పోషకాహారం పరీక్ష వంటి వాటిపై నిపుణులైన డాక్టర్లు ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు.
Nara Bhuvaneshwari
NTR Trust
Andhra Pradesh
இலவச மருத்துவ முகாம்
GSL Hospitals
இலவச மருத்துவ முகாம்
Alluri Sitarama Raju district
Rampachodavaram
Medical camp
Sirisha Devi

More Telugu News