సీఎం రేవంత్ రెడ్డి 'క్రిస్మస్' వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

  • సోనియా వల్లే తెలంగాణలో క్రిస్మస్ చేసుకుంటున్నారన్న రేవంత్ రెడ్డి
  • సోనియా గాంధీ చేసిన త్యాగాలే అందుకు కారణమని వెల్లడి
  • సూర్యుడు కూడా సోనియా వల్లే ఉదయిస్తాడని చెబుతారేమో అంటూ బీజేపీ సెటైర్
  • రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ జాతీయ నేతలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న క్రిస్మస్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే... ఇవాళ క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటున్నామంటే అందుకు సోనియా గాంధీ చేసిన త్యాగాలే కారణమని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ ముఖ్య పాత్ర పోషించారని, డిసెంబరు నెల తెలంగాణకు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. సోనియా పుట్టింది ఈ నెలలోనే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఈ నెలలోనే అని వ్యాఖ్యానించారు. 

దీనిపై తెలంగాణ బీజేపీ స్పందించింది. గాంధీ కుటుంబం వల్లే తెలంగాణలో సూర్యుడు ఉదయిస్తాడేమోనని కూడా చెబుతారేమో అని వ్యంగ్యం ప్రదర్శించింది. పొగడ్తలకు కూడా ఓ హద్దు ఉంటుందని, క్రిస్మస్ వేడుకలను కూడా సోనియాకు ఆపాదించడం సరికాదు అని తెలంగాణ బీజేపీ పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం దేన్నైనా మార్చేస్తారు... ఒకరిని ఆకాశానికెత్తే ప్రక్రియలో అన్ని హద్దులూ దాటేశారు అంటూ విమర్శించింది. 

అటు, బీజేపీ జాతీయ నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ స్పందిస్తూ... ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. సోనియా ఏ రోజూ హిందూ విశ్వాసాలపై నమ్మకం చూపలేదని, ఆమె ఇప్పటికీ క్రైస్తవ మతాన్నే అనుసరిస్తున్నారని తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు తన నివాసంలో క్రిస్మస్ వేడుకలు జరిపారే కానీ, దీపావళి జరపలేదని ఆరోపించారు. 

బీజేపీ నేత రాజ్ పురోహిత్ స్పందిస్తూ... ఏసు క్రీస్తు త్యాగాలతో సోనియాను పోల్చడం పిచ్చికి పరాకాష్ఠ అని విమర్శించారు. దేశానికి ఆమె కుమారుడ్ని ఇచ్చారా? ఇది ఒక త్యాగమా? ముఖ్యమంత్రి జాగ్రత్తగా మాట్లాడాలి అని హితవు పలికారు. 


More Telugu News