పవన్ కల్యాణ్ సిఫారసుతో రూ.35 కోట్లు కేటాయించడం హర్షణీయం: బండి సంజయ్

  • కొండగట్టు అంజన్న క్షేత్రంలో 96 గదుల సత్రం నిర్మాణం
  • పవన్ సిఫారసుతో నిధులు కేటాయించిన టీటీడీ
  • దీని వల్ల భక్తులకు ఎంతో మేలు జరుగుతుందన్న బండి సంజయ్
తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 96 గదుల సత్రం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.35.19 కోట్లు కేటాయించడం హర్షణీయమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిఫారసుతో ఈ నిధులు మంజూరు కావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. దీని వల్ల కొండగట్టుకు వచ్చే భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

కొండగట్టు ఆలయ అభివృద్ధికి గతంలో రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నయా పైసా నిధులు కేటాయించకపోగా, ఆర్జిత సేవల ఛార్జీలను పెంచి భక్తులపై అదనపు భారం మోపుతోందని ఆరోపించారు.

భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి తగిన నిధులు కేటాయించి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

టీటీడీ నిధులతో నిర్మించనున్న సత్రం పూర్తయితే కొండగట్టు దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.



More Telugu News