Shubman Gill: టీ20 జట్టు నుంచి తప్పించడంపై గిల్ కు ముందే చెప్పిన బోర్డు

BCCI Communicated With Shubman Gill About T20 World Cup Squad
  • జట్టు ప్రకటనకు ముందే ఫోన్ కాల్ చేసినట్లు బీసీసీఐ వెల్లడి
  • గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు మ్యాచ్ లకు గిల్ దూరం
  • దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించనున్న టీమిండియా కెప్టెన్
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటుదక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంలో గిల్ తో తాము టచ్ లో ఉన్నామని, టీ20 జట్టు కూర్పుపై ముందే ఫోన్ చేసి చెప్పామని బీసీసీఐ పేర్కొంది. క్రిక్‌బజ్‌ కథనం ప్రకారం.. ఇటీవలి దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లకు గిల్ అందుబాటులో లేడు.

పేలవమైన ప్రదర్శనకు తోడు గాయం కారణంగా గిల్ ను తుది జట్టు నుంచి తప్పించారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. అదే సమయంలో అహ్మదాబాద్ నుంచి గిల్ చండీగఢ్ కు బయలుదేరాడు. జట్టులో కూర్పు, సమతూకం కోసం గిల్ ను పక్కన పెడుతున్నట్లు బీసీసీఐ వర్గాలు ఆయనకు ఫోన్ లో సమాచారం అందించారు.

ఆసియాకప్ సందర్భంగా టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన గిల్.. 15 మ్యాచ్‌ లు ఆడి కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 ఫార్మాట్‌ లో గిల్ స్ట్రైక్‌ రేట్‌ ఆశించిన స్థాయిలో లేదు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. టీ20 జట్టులో చోటు దక్కకపోవడంతో గిల్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ హజారే టోర్నమెంట్‌లో పంజాబ్‌ తరఫున ఆడనున్నాడు.
Shubman Gill
T20 World Cup
BCCI
Indian Cricket Team
Vijay Hazare Trophy
Punjab Cricket
T20 Squad Selection
South Africa T20 Series
Indian Cricket Selectors
Cricket Buzz

More Telugu News