Suryakumar Yadav: నేను ఫామ్ అందుకుంటాను.. నాకు సమయం దొరికింది: సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav Confident of Regaining Form Before World Cup
  • వచ్చే నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్
  • ఈ విరామ కాలంలో ఫామ్ అందుకోవడంపై దృష్టి సారిస్తానని వెల్లడి
  • నేను ఫామ్‌లోకి రావడం అందరూ చూస్తారని ధీమా
ప్రపంచ కప్ నాటికి తాను ఫామ్ అందుకుంటానని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ విరామ సమయంలో తాను ఫామ్ అందుకోవడంపై దృష్టి సారిస్తానని సూర్యకుమార్ తెలిపాడు.

ఇటీవల సూర్యకుమార్ టీ20ల్లో నిరాశపరిచాడు. ఈ ఏడాది అతడు 19 ఇన్నింగ్స్‌లలో 218 పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా 34 పరుగులే చేశాడు. మరో రెండు మూడు నెలల్లోనే టీ20 ప్రపంచకప్ ఉండటంతో సూర్యకుమార్ ఫామ్‌లో లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ నేపథ్యంలో సూర్యకుమార్ మాట్లాడుతూ, ప్రపంచకప్ ముంగిట ఫామ్ అందుకుంటానని అన్నాడు. కొంతకాలంగా తాను ఫామ్‌లో లేనని అంగీకరించాడు. ప్రతి ఒక్కరు తమ కెరీర్‌లో ఇలాంటి దశను ఎదుర్కొని ఉంటారని భావిస్తున్నానని, దీనిని తాను కూడా అధిగమిస్తానని వ్యాఖ్యానించాడు.

ఎక్కడ తప్పు జరుగుతోంది, ఏం చేయాలనే విషయం తనకు తెలుసని అన్నాడు. దానిపై పనిచేయడానికి తనకు కొంత సమయం దొరికిందని తెలిపాడు. త్వరలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఉందని, ఆ తర్వాత కీలకమైన టీ20 ప్రపంచ కప్ ఉందని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. తాను ఫామ్‌లోకి రావడాన్ని అందరూ చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
Suryakumar Yadav
Suryakumar Yadav form
T20 World Cup
India vs New Zealand

More Telugu News