ప్రజాదర్బార్ లో ఓపిగ్గా వినతులు స్వీకరించిన నారా లోకేశ్... సమస్యలపై తక్షణ ఆదేశాలు

  • మంత్రి నారా లోకేశ్ 79వ ప్రజాదర్బార్‌కు వెల్లువెత్తిన వినతులు
  • భూకబ్జాలు, అక్రమ కేసులపై ఎక్కువగా అందిన ఫిర్యాదులు
  • ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల సమస్యపై ప్రత్యేక విజ్ఞప్తి
  • అర్జీలను పరిశీలించి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ
  • సమస్యల సత్వర పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రి
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 79వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లోకేశ్ ప్రతి అర్జీని స్వయంగా స్వీకరించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

ప్రజాదర్బార్‌లో ప్రధానంగా, వైసీపీ హయాంలో ఎదురైన ఇబ్బందులపైనే ఎక్కువ ఫిర్యాదులు అందాయి. ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని బాధితులు మంత్రిని కోరారు. 2015 నాటి సర్క్యులర్‌ను గత ప్రభుత్వం అమలు చేయలేదని వాపోయారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామస్థులు తమపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా నాయుడుపాలెంకు చెందిన ఇద్దరు మహిళలు తమ 2.5 ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు.

వీటితో పాటు, అన్నమయ్య జిల్లా కొండూరు పంచాయతీని విభజించాలని గ్రామస్థులు కోరారు. ప్రజల నుంచి వచ్చిన అన్ని వినతులను సావధానంగా విన్న మంత్రి లోకేశ్, ప్రతి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా పాలనలో పారదర్శకత పెరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


More Telugu News