ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు.. ఆ చట్టం తీసుకువస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

  • ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి
  • డిసెంబర్ నెల కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమన్న ముఖ్యమంత్రి
  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హేట్ రేట్ చట్టం తీసుకువస్తామని వెల్లడి
ఇతర మతాలను ఎవరైనా కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హేట్ రేట్ చట్టం ప్రవేశపెడతామని వెల్లడించారు. ఎవరి మతాన్ని వారు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఇతర మతాలను కించపరచకుండా చట్టాన్ని సవరించిందని గుర్తు చేశారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామంటే సోనియా గాంధీ పాత్ర, త్యాగం ఉందని అన్నారు. డిసెంబర్ నెల కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనదని ఆయన అన్నారు. డిసెంబరు నెలలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, సోనియా గాంధీ ఇదే నెలలో జన్మించారని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో వ్యవసాయంపై రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. ద్వేషించే వారిని కూడా ప్రేమించేలా జీసస్ చేశారని, ప్రపంచానికి ఆయన శాంతి సందేశం అందించారని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనిషి సగటు జీవన ప్రమాణం 32 ఏళ్లు అయితే ప్రస్తుతం 72గా ఉందని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చేశాయో క్రైస్తవ మిషనరీలు కూడా అంతేచేశాయని ప్రశంసించారు.


More Telugu News