DK Shivakumar: దేశంలోనే అత్యంత ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం... ఎక్కడ, ఎవరు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా..!

DK Shivakumar on Tallest Jesus Statue in India Controversy
  • దేశంలోనే అత్యంత ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటుపై కీలక పరిణామం
  • కర్ణాటకలోని కనకపురలో 114 అడుగుల విగ్రహం నిర్మాణం
  • ప్రభుత్వ భూమి కేటాయించానన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
  • ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయిన పనులు
  • విగ్రహ ఏర్పాటుపై బీజేపీ, హిందూ సంస్థల తీవ్ర వ్యతిరేకత
దేశంలోనే అత్యంత ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా? కర్ణాటకలోని కనకపురలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహం ఏర్పాటు వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. తాజాగా ఈ అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

తన నియోజకవర్గమైన కనకపురలో దేశంలోనే అత్యంత ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహ ఏర్పాటుకు భూమి కేటాయింపు ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. బెంగళూరులో బాల్డ్విన్ మెథడిస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. "నా నియోజకవర్గంలో 114 అడుగుల యేసు విగ్రహం నిర్మించడానికి ప్రభుత్వం నుంచి 10 ఎకరాల భూమిని కేటాయించేలా చూశాను. అందుకు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని నేనే చెల్లించాను" అని తెలిపారు. ఈ విషయంపై చాలా మంది తనను విమర్శించారని, లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉందని, అంతా చట్ట ప్రకారమే జరిగిందని వివరించారు.

కనకపుర పరిధిలోని హరోబెలె కపాలబెట్ట కొండపై 114 అడుగుల ఏకశిలా ఏసు విగ్రహాన్ని నిర్మించాలని శివకుమార్, హరోబెలె కపాలబెట్ట డెవలప్‌మెంట్ ట్రస్ట్ సంకల్పించాయి. అయితే, భూ కేటాయింపులపై చట్టపరమైన వివాదాలు తలెత్తడంతో పాటు, బీజేపీ, హిందూత్వ సంస్థలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. దీంతో కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం విగ్రహ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

అంతకుముందు జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించాల్సి రావడంతో క్రిస్మస్ వేడుకలకు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినట్లు డీకే శివకుమార్ తెలిపారు. తనకు అన్ని మతాలపై విశ్వాసం ఉందని, మానవత్వాన్ని నమ్ముతానని ఆయన పేర్కొన్నారు.
DK Shivakumar
Jesus Christ statue
Karnataka
Kanakapura
Harobele
Christianity
land allocation
religious statue
India
Kapalabetta

More Telugu News