మెస్సీ భారత పర్యటన ఖర్చు రూ.100 కోట్లు: విచారణలో కీలక విషయాలు వెల్లడి

  • మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించినట్లు వెల్లడించిన ఈవెంట్ నిర్వాకుడు
  • తాకడం, కౌగిలించుకోవడం వంటి చర్యలతో మెస్సీ స్టేడియం వీడినట్లు వెల్లడి
  • మెస్సీ పర్యటన కోసం ప్రభుత్వానికి రూ.11 కోట్లు పన్ను చెల్లింపు
భారత పర్యటన కోసం సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించినట్లు ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా వెల్లడించారు. లియోనల్ మెస్సీ భారత పర్యటన సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో చోటుచేసుకున్న ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శతాద్రు దత్తా అరెస్టై ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అతనిని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను విచారిస్తోంది. విచారణలో ఆయన కీలక విషయాలను వెల్లడించాడని తెలుస్తోంది.

సమాచారం ప్రకారం, స్టేడియంలోకి రాగానే అనేకమంది తాకడం, కౌగిలించుకోవడం వంటి చర్యలతో మెస్సీ అసౌకర్యానికి గురయ్యాడని, దీంతో అతడు షెడ్యూల్ కంటే ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయాడని దత్తా చెప్పారు. జనసమూహాన్ని అదుపు చేయాలని పదేపదే ప్రకటించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విచారణలో వెల్లడించారు. మైదానంలోకి రావడానికి 150 మందికి మాత్రమే పాసులు ఉన్నాయని, కానీ అంతకు మూడు రెట్లు ఎక్కువ మంది వచ్చారని తెలిపారు.

మెస్సీ పర్యటనకు మొత్తం రూ.100 కోట్లు ఖర్చయిందని శతద్రు వెల్లడించారు. మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించామని, భారత ప్రభుత్వానికి రూ.11 కోట్లు పన్నుగా చెల్లించామని తెలిపాడు. ఈ నిధుల్లో 30 శాతం స్పాన్సర్ల ద్వారా, మరో 30 శాతం టిక్కెట్లు విక్రయం ద్వారా సేకరించినట్లు ఆయన చెప్పాడని సమాచారం.


More Telugu News