ఈ విషయంలో సెలెక్టర్లకు 10/10 మార్కులు వేస్తా: హర్భజన్ సింగ్

  • టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక
  • గిల్ కు దక్కని చోటు
  • ఇషాన్ కిషన్, రింకూ సింగ్ లకు అవకాశం
  • సెలెక్షన్ ప్రక్రియపై హర్భజన్ స్పందన
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో చేసిన మార్పులపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి, జట్టు యాజమాన్యానికి 10కి 10 మార్కులు ఇచ్చాడు. రింకూ సింగ్, ఇషాన్ కిషన్‌లను తిరిగి జట్టులోకి తీసుకోవడం, అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయాలని కొనియాడాడు.

జియోస్టార్‌తో మాట్లాడుతూ హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "సెలక్షన్ కమిటీకి నేను 10కి 10 మార్కులు ఇస్తాను. శుభ్‌మన్ గిల్‌ను తప్పించడం కఠినమైన నిర్ణయమే అయినా, టీ20లలో అతడి కెరీర్ ముగిసిపోలేదు. జట్టు సమతూకానికే వారు ప్రాధాన్యత ఇచ్చారు. రింకూ సింగ్, ఇషాన్ కిషన్ జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇషాన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్‌గా వచ్చి వికెట్ కీపింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు అవసరం కాబట్టే ఈ మార్పులు చేశారు. ఇది చాలా మంచి నిర్ణయం" అని భజ్జీ విశ్లేషించాడు.

గిల్‌ను తప్పించడం అతడి సామర్థ్యానికి తక్కువ అంచనా వేయడం కాదని, భవిష్యత్తులో అతను కీలక ఆటగాడిగా ఎదుగుతాడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. "గిల్ ఒక నాణ్యమైన ఆటగాడు. ఇది అతనికి చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. జట్టు కూర్పులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని యాజమాన్యం అతనికి వివరించాలి. ఈ అనుభవం అతడిని మరింత మెరుగైన ఆటగాడిగా మారుస్తుంది" అని పేర్కొన్నాడు.


More Telugu News