మీ చాప్టర్ క్లోజ్... జగన్ రెడ్డి ఇంకా భ్రమలోనే బతుకుతున్నారు: మంత్రి సవిత

  • పీపీపీపై జగన్‌ది ద్వంద్వ వైఖరని మంత్రి సవిత విమర్శ
  • ఢిల్లీలో ఎంపీల మద్దతు, ఇక్కడ గల్లీ రాజకీయాలని ఎద్దేవా
  • కోడి కత్తి, గులకరాయి డ్రామాల్లాగే సంతకాల డ్రామా అని ఫైర్
  • మెడికల్ కాలేజీలను పీపీపీలోనే పూర్తి చేస్తామని స్పష్టీకరణ
  • అభివృద్ధికి అడ్డుపడితే రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరిక
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంకా పాత భ్రమల్లోనే బతుకుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు 'డైవర్షన్' రాజకీయాలకు తెరలేపుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల విషయంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంపై వైసీపీది ద్వంద్వ వైఖరని, వారి ఎంపీలు ఢిల్లీలో మద్దతుగా సంతకాలు పెట్టి, ఇక్కడ గల్లీలో జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు.

గతంలో కోడికత్తి, గులకరాయి డ్రామాలతో ప్రజలను మోసం చేసిన జగన్, ఇప్పుడు 'కోటి సంతకాలు' అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని సవిత ఎద్దేవా చేశారు. "ప్రజలు మీ నాటకాలను గ్రహించి, మిమ్మల్ని రాజకీయాల నుంచి డైవర్షన్ చేసి ఇంటికి పంపారు. చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం" అని ఆమె అన్నారు. 

17 మెడికల్ కాలేజీలు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్, వాటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు చేసింది సున్నా అని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ.1,550 కోట్ల నిధులతోనే పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేశారని, దీనిపై త్వరలోనే ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి లెక్కలతో వాస్తవాలు బయటపెడతారని తెలిపారు.

పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని సవిత స్పష్టం చేశారు. "ప్రజలకు మంచి జరుగుతుంటే దానిపై కూడా విషం చిమ్మడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. పీపీపీ విధానం ఇతర రాష్ట్రాల్లో ఎలా విజయవంతమైందో మీకు తెలిసినా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు" అని మండిపడ్డారు. 

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడం, ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసి అప్పులు పుట్టకుండా చేయడం వంటి చర్యలతో జగన్ 'ఆంధ్రప్రదేశ్ ద్రోహి'గా మారుతున్నారని ఆమె హెచ్చరించారు. "మీ సొంత తల్లి, చెల్లి కూడా మిమ్మల్ని నమ్మని పరిస్థితి ఉందంటే మీ వ్యక్తిత్వం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు" అని వ్యాఖ్యానించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి సవిత వివరించారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు, మంత్రి లోకేశ్ విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నారని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. "మీరు ప్రజావేదికను కూల్చి, పోలవరాన్ని పాడుబెట్టి, టిడ్కో ఇళ్లను గాలికి వదిలేశారు. కానీ మేము వాటిని పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నాం. ప్రజల సొమ్ముతో మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టునైనా పూర్తి చేయాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం" అని అన్నారు.

"ముప్పై ఏళ్లు నేనే సీఎం అని విర్రవీగిన మీకు, ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే మీ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పటికైనా భ్రమల నుంచి బయటకు వచ్చి, అభివృద్ధికి సలహాలు ఇవ్వండి. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేసి తీరుతాం. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడమే మా లక్ష్యం" అని మంత్రి సవిత స్పష్టం చేశారు.


More Telugu News