Chandrababu Naidu: పాలనకు భూ బకాసురులు అడ్డంకులు సృష్టిస్తున్నారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says land grabbers are creating obstacles to governance
  • మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లపై కేసులు వేశారని చంద్రబాబు ఆగ్రహం
  • ఐటీ కంపెనీలు వస్తున్నా అడ్డుకుంటున్నారని వ్యాఖ్య
  • మెడికల్ కాలేజీలను మేనేజ్‌మెంట్‌కు ఇచ్చాం, ప్రైవేట్‌కు కాదని స్పష్టీకరణ
రాష్ట్రంలో తాను యజ్ఞంలా పాలన చేస్తుంటే, కొందరు భూ బకాసురులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా కేసులు వేస్తూ ఆటంకం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన 'స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే, దానిపై 40 నుంచి 50 కేసులు వేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టుల్లో కేసులు వేశారని విమర్శించారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు వస్తుంటే వాటిపైనా కేసులు వేస్తున్నారని అన్నారు. ఒకవైపు పనిచేస్తూనే, మరోవైపు ఈ కేసులపై పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వైద్య కళాశాలలపై వస్తున్న విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వలేదని, కేవలం మేనేజ్‌మెంట్‌కు మాత్రమే అప్పగించామని స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరుగుతాయని తెలిపారు. ఆ ఆసుపత్రుల్లో చేరే పేషెంట్లందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగానే వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, ప్రపంచంలోని 150 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని గుర్తుచేశారు. భూ బకాసురులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
Land grabbers
Mega DSC
Constable jobs
IT companies
Medical colleges
Vishakapatnam
Yoga Day

More Telugu News