సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ఇవి కూడా ఉన్నాయి!

  • విడుదలైన సంచలన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్
  • భారత ఆయుర్వేదం, మసాజ్ టెక్నిక్‌ల ప్రస్తావన
  • ఫైల్స్‌లో ట్రంప్, బిల్ క్లింటన్ ఫోటోలు
  • లైంగిక ఆరోపణల నేపథ్యంలో జైల్లో ఆత్మహత్య చేసుకున్న ఎప్‌స్టీన్
అమెరికాలో తీవ్ర సంచలనం సృష్టించిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన వేలాది ఫైళ్లను అక్కడి న్యాయ విభాగం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫైల్స్‌లో అమెరికా రాజకీయ ప్రముఖులతో పాటు అనూహ్యంగా భారతీయ ఆయుర్వేదం, మసాజ్ టెక్నిక్‌ల గురించి ప్రస్తావన ఉండటం ఆసక్తి రేపుతోంది. గత నెలలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన బిల్లు ప్రకారం 30 రోజుల్లోగా ఈ ఫైళ్లను విడుదల చేయాల్సి ఉండటంతో ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

విడుదలైన ఫైల్స్‌లోని ఒక పత్రంలో డీటాక్స్ (శరీర శుద్ధి) కోసం ఆయుర్వేదం, మసాజ్‌లను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. "భారత్‌కు చెందిన 5,000 ఏళ్ల పురాతన సహజ వైద్య విధానం ఆధారంగా పశ్చిమ దేశాల్లోని ఎంతో మంది నిపుణులు మసాజ్‌లు, ఇతర చికిత్సలు అందిస్తున్నారు" అని ఆ పత్రంలో ఉంది. అలాగే, 'ది ఆర్ట్ ఆఫ్ గివింగ్ మసాజ్' అనే శీర్షికతో ఉన్న మరో ఆర్టికల్‌లో డీటాక్స్ కోసం నువ్వుల నూనె వాడకం గురించి వివరించారు.

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులతో సంబంధాలున్న ఎప్‌స్టీన్ ఫైళ్లను విడుదల చేయాలని డెమోక్రాట్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎప్‌స్టీన్‌తో స్నేహంగా ఉన్న ట్రంప్‌కు ఈ వ్యవహారం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. విడుదలైన ఫైల్స్‌లో ట్రంప్‌కు చెందిన కొన్ని ఫోటోలతో పాటు, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌లతో ఎప్‌స్టీన్ ఉన్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ పత్రాల వెల్లడి ఇంకా అసంపూర్ణంగానే ఉందని న్యాయ విభాగం అంగీకరించింది.

ఎప్‌స్టీన్ కేసుతో సంబంధించి ట్రంప్ గానీ, క్లింటన్ గానీ ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం లేదని స్పష్టత ఇచ్చారు. కాగా, మైనర్ బాలికలను లైంగికంగా వేధించి, అక్రమ రవాణా చేశారన్న తీవ్ర ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్, 2019లో మాన్‌హట్టన్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.


More Telugu News