సరైన సమయంలో నన్ను, సిద్ధరామయ్యను పిలుస్తామన్నారు: డీకే శివకుమార్

  • కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై మళ్లీ రాజుకున్న వివాదం
  • ఈ విషయం అధిష్ఠానం చేతుల్లో ఉందన్న డీకే శివకుమార్
  • అధికారిక పనుల నిమిత్తం మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న డీకేశ్
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన నాయకత్వ పోరు మరోసారి బహిర్గతమైంది. సరైన సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, తనను ఢిల్లీకి పిలుస్తామని పార్టీ అధిష్ఠానం తెలిపిందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం వెల్లడించారు. ఈ పరిణామంతో సీఎం మార్పుపై జరుగుతున్న చర్చకు మరింత బలం చేకూరినట్లయింది.

బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల తర్వాత అధిష్ఠానంతో సమావేశం ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు శివకుమార్ స్పందించారు. "ఎప్పుడు ఢిల్లీ వెళ్లాలో మా ఇద్దరికీ హైకమాండ్ ఫోన్‌లో తెలియజేసింది. పిలుపు వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి వెళతాం. ఆ విషయాన్ని మీడియాకు చెప్పకుండా దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.

అయితే, మంగళవారం తాను అధికారిక పనుల మీద ఢిల్లీ వెళుతున్నానని శివకుమార్ తెలిపారు. నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటానని చెప్పారు. ఈ సందర్భంగా మహదాయి, కృష్ణా జలాలు, మేకెదాటు, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళతానని, అవసరమైతే ప్రధానిని కూడా కలుస్తానని వివరించారు.

ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని, అధికార పంపకాల ఒప్పందం ఏదీ లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, "ముఖ్యమంత్రి, నేను, హైకమాండ్ ఒక ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం" అని శివకుమార్ స్పష్టం చేశారు. దీంతో కర్ణాటక సీఎం కుర్చీ వివాదం ఇప్పుడు అధిష్ఠానం చేతుల్లోకి వెళ్లినట్లయింది.


More Telugu News