వరల్డ్ కప్ కు గిల్ ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది: గవాస్కర్

  • టీ20 వరల్డ్ కప్-2026కి టీమిండియా ఎంపిక
  • గిల్ కు దక్కని చోటు... వైస్ కెప్టెన్ గా అక్షర్ర పటేల్
  • ఫామ్ లేకపోవడమే గిల్‌కు ప్రతికూలంగా మారిందన్న గవాస్కర్
  • వికెట్ కీపర్ ఓపెనర్ కావాలనే గిల్‌ను పక్కనపెట్టినట్లు తెలిపిన సెలెక్టర్లు
రాబోయే టీ20 ప్రపంచకప్‌ భారత జట్టు నుంచి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయకపోవడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో ఫామ్ లేకపోవడం, టచ్ కోల్పోవడమే అతనికి ప్రతికూలంగా మారి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. గిల్ ఒక క్లాసిక్ బ్యాటర్ అని, కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన కొన్ని మ్యాచ్‌లలో ఇబ్బంది పడ్డాడని గుర్తుచేశాడు.

ఈ విషయంపై గవాస్కర్ మాట్లాడుతూ.. "గిల్‌ను తప్పించడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతను నాణ్యమైన ఆటగాడు. ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. అయితే సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగడంతో అతను లయ అందుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడాలి. గిల్ సహజ శైలి టెస్ట్ క్రికెట్‌కు సరిగ్గా సరిపోతుంది. కానీ ఐపీఎల్‌లో తనేంటో నిరూపించుకున్నాడు. బహుశా ఫామ్ లేకపోవడమే అతడి ఎంపికపై ప్రభావం చూపింది" అని విశ్లేషించాడు.

మరోవైపు, వికెట్ కీపర్-ఓపెనర్ కావాలనే ఉద్దేశంతోనే గిల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ఇషాన్ కిషన్ ఎంపికను గవాస్కర్ స్వాగతించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఝార్ఖండ్‌ను కెప్టెన్‌గా నడిపించి, 10 ఇన్నింగ్స్‌లలో 517 పరుగులు చేయడం అతని ప్రతిభకు నిదర్శనమన్నాడు. కేవలం ఐపీఎల్ ప్రదర్శననే కాకుండా, దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపాడు.

అదే సమయంలో, వికెట్ కీపర్ జితేష్ శర్మను తప్పించడం బాధాకరమని గవాస్కర్ అన్నాడు. తనకు వచ్చిన అవకాశాల్లో జితేష్ అద్భుతంగా రాణించాడని, డీఆర్‌ఎస్ విషయంలో కెప్టెన్‌కు ధోనీ తర్వాత అంత కచ్చితత్వంతో సలహాలు ఇచ్చేవాడని కొనియాడాడు. గిల్ గైర్హాజరీలో అక్షర్ పటేల్‌ను భారత జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు.


More Telugu News