Kadiyam Srihari: బీఆర్ఎస్‌లోనే ఉన్నానన్న కడియం శ్రీహరికి ఘనపూర్‌లో ఫ్లెక్సీతో వినూత్న నిరసన

Kadiyam Srihari BRS Flexi Protest in Ghanpur Over Party Switch
  • కడియం శ్రీహరికి స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ ఫ్లెక్సీ
  • కడియం శ్రీహరి, రాజయ్య ఫొటోలను చెరో వైపు పెట్టి ప్లెక్సీ ఏర్పాటు
  • అధికారులు తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత
తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్‌కు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో వినూత్న నిరసన చేపట్టాయి. కడియం శ్రీహరికి స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం స్థానికంగా రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసింది. నియోజకవర్గంలోని తిరుమలనాథ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయనుంది.

ఈ నేపథ్యంలో గులాబీ రంగులోని బీఆర్ఎస్ ఫ్లెక్సీలో కడియం శ్రీహరి, మాజీ మంత్రి రాజయ్య చిత్రాలను చెరో వైపు ఉంచారు. "తిరుమలనాథ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేయుచున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం" అంటూ ఆ బీఆర్ఎస్ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ఆయన స్పీకర్‌కు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో నిరసనగా ఆ పార్టీ శ్రేణులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి.

ఫ్లెక్సీని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో అధికారులకు, నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. అభివృద్ధి కోసమంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, తాను ఇంకా బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నానని చెప్పడం ఏమిటని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
Kadiyam Srihari
Station Ghanpur
BRS Party
Telangana Politics
Tirumalanatha Swamy Temple

More Telugu News