పవనన్న చేసిన భగీరథ ప్రయత్నం ఫలించింది: మంత్రి నారా లోకేశ్

  • 'అమరజీవి జలధార' పథకానికి శంకుస్థాపన చేసిన పవన్ కల్యాణ్
  • ఉభయ గోదావరి జిల్లాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం
  • పవన్ కల్యాణ్‌కు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అభినందనలు
  • లోకేశ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చే దిశగా ముందడుగు వేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కల్యాణ్ 'అమరజీవి జలధార' పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా ప్రజల దాహార్తి తీర్చడానికి కృషి చేయనున్నారు.

ఈ కార్యక్రమంపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన జలాలు అందించేందుకు పవన్ చేసిన భగీరథ ప్రయత్నం ఫలించిందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తున్న పవన్ కల్యాణ్‌కు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

మంత్రి లోకేశ్ శుభాకాంక్షలపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 'జల్ జీవన్ మిషన్' పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పారు.

"ప్రజలందరికీ రోజుకు కనీసం 55 లీటర్ల సురక్షిత త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యం లోని కూటమి ప్రభుత్వం ద్వారా, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దాహార్తి తీర్చే ఈ 'అమరజీవి జలధార ప్రాజెక్ట్' పట్ల అభినందనలు తెలియజేసినందుకు మిత్రుడు, సహచర మంత్రివర్యుడు నారా లోకేశ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారిని నిరంతరం స్మరించుకునేలా మధ్యాహ్న భోజన పథకానికి నామకరణం చేసినందుకు, ఆవిడ జన్మించిన గోదావరి నేల నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్ లో స్పందించారు.


More Telugu News