ఉపాధి హామీ పథకంపై కేంద్రం బుల్డోజర్: సోనియా గాంధీ తీవ్ర విమర్శలు

  • గ్రామీణ పేదల హక్కులను కాలరాస్తున్నారన్న సోనియా
  • మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించారని ఆరోపణ
  • ఈ నల్ల చట్టంపై పోరాటానికి సిద్ధమన్న సోనియా
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)పై కేంద్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం బుల్డోజర్ నడుపుతోందని ఆమె శనివారం ఆరోపించారు. ఇది గ్రామీణ పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాలరాయడమేనని, వారి జీవనోపాధిపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ 'ఎక్స్' ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. రెండు రోజుల క్రితం పార్లమెంటులో వీబీ-జీ రామ్ జీ బిల్లు 2025ను ఆమోదించిన నేపథ్యంలో సోనియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని సోనియా గుర్తుచేశారు. ఇది కోట్లాది గ్రామీణ కుటుంబాలకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు జీవనోపాధి భద్రత కల్పించిన ఒక విప్లవాత్మక అడుగు అని ఆమె పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ పథకం పేదలకు జీవనాధారంగా నిలిచిందని తెలిపారు.

అయితే, గత 11 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు అనేక ప్రయత్నాలు చేసిందని సోనియా ఆరోపించారు. ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపకుండా, ఏకపక్షంగా ఉపాధి హామీ పథకం స్వరూపాన్నే మార్చేశారని, చివరకు మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి, ఎక్కడ, ఎంత పని ఇవ్వాలనే నిర్ణయాలను క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఢిల్లీ నుంచి తీసుకుంటున్నారని విమర్శించారు.

"20 ఏళ్ల క్రితం ఈ చట్టం కోసం నేను పోరాడాను. ఇప్పుడు ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా నేను కట్టుబడి ఉన్నాను" అని సోనియా ఉద్ఘాటించారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.


More Telugu News