Revanth Reddy: పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. 16 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి అసహనం

Revanth Reddy Displeased with 16 MLAs Over Panchayat Election Performance
  • రెబల్స్‌తో సమన్వయం చేయలేకపోయారంటూ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహం
  • బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడంపై అసహనం
  • ఇప్పటికైనా తీరు మార్చుకుని పార్టీ నిబంధనలకు లోబడి పని చేయాలన్న అధిష్ఠానం
పంచాయతీ ఎన్నికల్లో సరిగ్గా పని చేయలేదంటూ 16 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు.

ఈ సందర్భంగా, పలు ప్రాంతాల్లో రెబల్స్‌ను సమన్వయం చేయలేకపోయారంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు.

రెబల్స్‌తో సమన్వయ లోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా పార్టీకి తీరని నష్టం చేశారని సీఎం అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని ఆదేశించారు.

తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,733 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 7,000కు పైగా స్థానాల్లో గెలవగా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 3,502కు పైగా స్థానాల్లో, బీజేపీ 688 స్థానాల్లో విజయం సాధించారు. తమకు పట్టున్న కొన్ని స్థానాలను కోల్పోవడంపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలో బాధ్యులపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Revanth Reddy
Telangana
Panchayat Elections
Congress Party
MLAs
TPCC

More Telugu News