Pawan Kalyan: ఒక గొప్ప నాయకుడిని ఒక కులానికి పరిమితం చేస్తారా?: పవన్ కల్యాణ్

Pawan Kalyan Comments on Caste and Great Leaders
  • గొప్ప నాయకులకు కులాలను ఆపాదించవద్దన్న పవన్ కల్యాణ్
  • పొట్టి శ్రీరాములును ఒక కులానికి పరిమితం చేయడంపై ఆవేదన
  • ఉభయగోదావరి జిల్లాల్లో అమరజీవి జలధార ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • రూ.3,050 కోట్ల వ్యయంతో సురక్షిత తాగునీటి పథకం
  • బూర్గుల, పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకున్న ఉపముఖ్యమంత్రి
మహనీయులకు, గొప్ప నాయకులకు కులాలను అంటగడితే మనం ఎప్పటికీ భారతీయులుగా ఎదగలేమని, కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రూ.3,050 కోట్ల వ్యయంతో చేపడుతున్న 'అమరజీవి జలధార' ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అంబేద్కర్, గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి వారు అందరి కోసం ఆలోచించిన గొప్పవారని, వారిని కులాలకు అతీతంగా చూడాలని సూచించారు. గతంలో తాను పొట్టి శ్రీరాములు జయంతి నాడు నివాళులు అర్పించేందుకు వెళ్తే, ఆయన విగ్రహం ఒక ఆర్యవైశ్య సత్రం వద్ద ఉందని చెప్పారని, ఆ రోజు తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజలందరి కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని ఒక కులానికి, నెల్లూరు జిల్లాకు పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లాల్లో 'అమరజీవి జలధార' వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.7,910 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 'అమరజీవి' అని పేరు పెట్టడానికి బలమైన కారణం ఉందని వివరించారు. తెలుగువారంతా ఏకం కావాలని ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు తనకు ఎంతో ఇష్టమైన నాయకులని, వారి త్యాగాలను స్మరించుకుంటూనే ఈ పథకానికి ఆ పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.
Pawan Kalyan
Pawan Kalyan speech
Amara Jeevi Jaladhara Project
Potti Sriramulu
Burgula Ramakrishna Rao
Andhra Pradesh water project
Jana Sena
AP Deputy CM
Caste politics Andhra Pradesh
Godavari districts

More Telugu News