బెంగాల్‌లో ప్రతికూల వాతావరణం.. వెనక్కి తిరిగి వచ్చిన మోదీ హెలికాప్టర్

  • వాతావరణం అనుకూలించకపోవడంతో తాహెర్‌పూర్‌లో దిగలేకపోయిన హెలికాప్టర్
  • కాసేపు అక్కడే చక్కర్లు కొట్టి కోల్‌కతాకు తిరిగి వచ్చిన హెలికాప్టర్
  • నాడియా జిల్లా కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెనక్కి మళ్లించారు. ఆయన నాడియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ తాహెర్‌పూర్ హెలిప్యాడ్‌లో దిగలేక కోల్‌కతా విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.

హెలికాప్టర్ హెలిప్యాడ్ వద్ద దిగడానికి అక్కడే కొద్దిసేపు చక్కర్లు కొట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో తిరిగి వచ్చిందని అధికారులు తెలిపారు. ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ప్రధాని మోదీ కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తాహెర్‌పూర్‌కు బయలుదేరారు. అయితే పొగమంచు కారణంగా హెలిప్యాడ్‌పై ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దాంతో పైలట్ ల్యాండింగ్‌కు కొద్దిసేపు ప్రయత్నించి విఫలమయ్యారు.

నాడియా జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొనాల్సి ఉంది. రోడ్డు మార్గంలో వెళితే షెడ్యూల్‌కు అంతరాయం కలుగుతుందని భావించి, విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ నుంచి ఆయన వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.


More Telugu News