బీజేపీలో చేరిన సినీ నటి ఆమని... ప్రజా సేవకు అంకితమవుతానని వ్యాఖ్య

  • తెలంగాణ బీజేపీలో చేరిన సీనియర్ నటి ఆమని
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
  • మోదీ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్న ఆమని
తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ మళ్లీ తెరపైకి వచ్చింది. అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని ఈరోజు కాషాయ కండువా కప్పుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలై బీజేపీలో చేరినట్లు తెలిపారు. "భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మోదీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరాను. ఆయన సనాతన ధర్మం కోసం ఎంతో పాటుపడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అయితే, వీరిలో విజయశాంతి తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ సినీ ప్రముఖులను చేర్చుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. ఆమని బాటలోనే మరికొందరు నటీనటులు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 


More Telugu News