Nara Lokesh: మీ సేవ అభినందనీయం.. ప్రభుత్వ టీచర్‌పై మంత్రి లోకేశ్ ప్రశంసలు

Nara Lokesh Praises Government Teacher Moturi Mangarani
  • ప్రభుత్వ టీచర్ మోటూరి మంగారాణిని ప్రశంసించిన మంత్రి లోకేశ్
  • యూట్యూబ్ ఛానల్ ద్వారా వినూత్నంగా విద్యాబోధన
  • ప్రమాదానికి గురైన విద్యార్థికి అండగా నిలిచిన సేవా స్ఫూర్తి
  • మంగారాణి వంటి వారితోనే ఏపీ మోడల్ విద్య సాధ్యమన్న లోకేశ్
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ప్రశంసల వర్షం కురిపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు మోటూరి మంగారాణి సేవానిరతిని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా ఓ పోస్ట్ పెట్టారు.

అంకితభావం, సేవా దృక్పథంతో మంగారాణి విధులు నిర్వర్తిస్తున్నారని లోకేశ్ అభినందించారు. తరగతి గది బోధనకే పరిమితం కాకుండా రైమ్స్, ఆటల ఆధారిత పాఠాలు, స్ఫూర్తి కథలు, 3డి యానిమేషన్ వీడియోలు రూపొందించి 'Mangarani Lessons' అనే యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా లక్షలాది మంది విద్యార్థులకు విద్యను చేరువ చేస్తున్న ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పారు.

మంగారాణి సేవా స్ఫూర్తిని కూడా లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల అదే పాఠశాల విద్యార్థి సత్తి చరణ్ తేజ్ ప్రమాదానికి గురికాగా, తోటి ఉపాధ్యాయులతో కలిసి విరాళాలు సేకరించి ఆ బాలుడి వైద్యానికి అండగా నిలిచారని గుర్తుచేశారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన మంగారాణి.. టెక్స్ట్ బుక్ రైటర్‌గా, టీచర్ ట్రైనర్‌గా కూడా సేవలు అందిస్తున్నారని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని చాటిచెబుతున్న మంగారాణి వంటి ఉపాధ్యాయుల కృషితోనే 'ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్' కల సాకారం అవుతుందని ఆయన తన పోస్టులో ఆశాభావం వ్యక్తం చేశారు.
Nara Lokesh
Moturi Mangarani
AP Model of Education
Government Teacher
Andhra Pradesh Education
Rajamahendravaram
Mangarani Lessons
Satti Charan Tej
Teacher Award
Education

More Telugu News