బంగ్లాదేశ్ లో హిందూ యువకుడి హత్యపై తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు

  • అక్కడ జిహాదీల పండుగ నడుస్తోందన్న రచయిత్రి
  • హిందూ యువకుడిపై సహోద్యోగి కుట్ర చేశాడని ఆరోపణ
  • పోలీసులు కూడా పట్టించుకోలేదని తీవ్ర వ్యాఖ్యలు చేసిన తస్లీమా
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు అమానుషమని, అక్కడ ప్రస్తుతం ‘జిహాదీల పండుగ’ నడుస్తోందని బంగ్లా బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిట్టగాంగ్‌లో దీపు దాస్ అనే హిందూ యువకుడిని అల్లరి మూకలు కొట్టి చంపిన (లించింగ్) ఉదంతంపై ఆమె సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో దీపు దాస్ పై మూకదాడి జరిగింది. తీవ్ర గాయాలతో దాస్ మరణించగా.. ఆయన మృతదేహాన్ని నడి రోడ్డుపై తగులబెట్టారు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఈ అమానవీయ ఘటనపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందిస్తూ.. "బంగ్లాదేశ్ ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. హిందువులను చంపడం అక్కడ ఒక పండుగలా జరుపుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అనే పదాలకు బంగ్లాదేశ్ లో విలువే లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. వాస్తవానికి దీపు దాస్ ఎలాంటి దైవ దూషణకు పాల్పడలేదని, సహోద్యోగి చేసిన కుట్రకు దీపు దాస్ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు.

దీపు దాస్ తో పనిచేసే ఓ ముస్లిం వ్యక్తి అతనిపై కక్షతో కుట్ర చేసి.. జనం మధ్యలో ఉన్న సమయంలో దీపు దాస్ దైవ దూషణకు పాల్పడ్డాడని గట్టిగా అరిచాడన్నారు. దీంతో చుట్టూ ఉన్న జనం దీపు దాస్ పై దాడి చేశారని, ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి దీపు దాస్ ను అరెస్ట్ చేశారన్నారు. పోలీస్ స్టేషన్ లో దీపు దాస్ తనపై సహోద్యోగి చేసిన కుట్రను వెల్లడించినా వారు పట్టించుకోలేదన్నారు. దీపు దాస్ ను తిరిగి జనంలోకి పోలీసులే వదిలిపెట్టారా? లేక ఆ గుంపే దీపూని బయటకు లాక్కుని వెళ్లారా? అని తస్లీమా ప్రశ్నించారు. ఏమైనా, దీపూని కొట్టి, చంపేసి, దహనం చేసి జిహాదీ పండుగ చేసుకున్నారని ఆమె ఆరోపించారు.

కాగా, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సంస్థపై ఆంక్షలు విధించడం, హిందూ మత పెద్దలను అరెస్టు చేయడం వంటి పరిణామాల మధ్య ఈ హత్య జరగడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. మైనారిటీల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు ఐక్యరాజ్యసమితికి మరియు అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.


More Telugu News