: ఫాంహౌస్ వీడి ప్రజల్లోకి కేసీఆర్.. రేపు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత!

  • సాగునీటి హక్కుల కోసం కేసీఆర్ సమరశంఖం
  • రేపు బీఆర్ఎస్ శాసనసభాపక్ష, కార్యవర్గ సంయుక్త భేటీ
  • పార్టీ సంస్థాగత బలోపేతంపైనా సమావేశంలో చర్చ
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారు. చాలా రోజుల విరామం తర్వాత ఆయన రేపు (ఆదివారం) తెలంగాణ భవన్‌కు రానున్నారు. రాష్ట్ర సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.

రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే అంగీకరించి తెలంగాణకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఈ విషయంపై మౌనంగా ఉన్నారని కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

మరోవైపు, పార్టీ ప్రక్షాళన, సంస్థాగత బలోపేతంపైనా కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. చాలాకాలం తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్‌కు వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

More Telugu News